నేడు ఢిల్లీలో 'ఇండియా' కూటమి 'చలో ఢిల్లీ' మెగా ర్యాలీ.. రామ్‌లీలా మైదానంలో విపక్షాల మహా ప్రదర్శన, భద్రత కట్టుదిట్టం
:సూర్య నేషనల్ బ్యూరో, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా విపక్ష ‘ఇండియా’కూటమి బలప్రదర్శనకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ మహా ర్యాలీ నేడు (నవంబర్ 1, ఆదివారం) చారిత్రక రామ్‌లీలా మైదానంలో ప్రారంభం కానుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని, ‘ఓట్ల చోరీ’ జరుగుతోందని ఆరోపిస్తూ.. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా ఈ భారీ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు కూటమి నేతలు ప్రకటించారు.కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఎస్పీ, డీఎంకే, టీఎంసీ, ఆప్, ఎన్సీపీ (శరద్ పవార్), ఆర్జేడీ, వామపక్షాలు సహా పలు విపక్ష పార్టీల అగ్రనేతలు, భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు ఈ సభకు హాజరవుతున్నారు. మింటో రోడ్ జంక్షన్ నుంచి రామ్‌లీలా మైదానం వరకు ర్యాలీగా చేరుకుని అక్కడ బహిరంగ సభను నిర్వహించనున్నారు. అంతకుముందు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా 'ప్రజా అభిశంసన' నిర్వహించిన విపక్షాలు, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని ఈ వేదిక నుంచి డిమాండ్ చేయనున్నాయి. మరోవైపు నవంబర్ 1వ తేదీని ర్యాలీకి ఎంచుకోవడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధిత కుటుంబాల సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. భారీ జనసమీకరణ దృష్ట్యా ఢిల్లీ పోలీసులు సెంట్రల్ ఢిల్లీ పరిధిలో రామ్‌లీలా మైదానం, ఢిల్లీ గేట్, ఐటీవో, అజ్మేరి గేట్, మింటో రోడ్ తదితర కీలక ప్రాంతాల్లో 10కి పైగా ట్రాఫిక్ డైవర్షన్లు విధించి, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.