ఇండియాఏఐ మిషన్ కింద చారియట్-1 ఫౌండేషన్ మోడల్స్ ఆవిష్కరణ
సూర్య జాతీయ డెస్క్: దేశీయ కృత్రిమ మేధ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇండియాఏఐ మిషన్ కింద చారియట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ రూపొందించిన చారియట్-1 ఫౌండేషన్ మోడల్స్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ గురువారం ఆవిష్కరించింది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన కార్యక్రమంలో పరిశోధన ప్రదర్శనతో పాటు ఈ మోడల్స్‌ను ఆ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ ప్రారంభించారు. స్వదేశీ పరిశోధనలు మరియు ఆవిష్కరణల ద్వారా దేశ అవసరాలకు అనుగుణమైన సార్వభౌమ ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేయగల భారత సామర్థ్యాన్ని ఈ ఆవిష్కరణ చాటిచెప్పింది. సార్వభౌమ ఫౌండేషన్ మోడల్స్ రూపకల్పన కోసం ఇండియాఏఐ మిషన్ కింద ఎంపికైన తొలి నాలుగు బృందాలలో చారియట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటిగా నిలిచింది.
చారియట్-1 మోడల్ సూట్‌లో భారత్‌లోనే మొదటి నుంచి శిక్షణ ఇచ్చిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మరియు టెక్స్ట్-టు-స్పీచ్ మోడల్ ఉన్నాయి. భాషా అవగాహనను మెరుగుపరచడం, ఆడియో రూపంలో మాటలను ఉత్పత్తి చేయడం లక్ష్యంగా వీటిని రూపొందించారు. వివిధ సాంకేతిక వాతావరణాలకు అనుగుణంగా సులభంగా పనిచేసేలా, బహుళ భాషలలో సమర్థవంతంగా సేవలు అందించేలా నూతన పరిశోధనా విధానాలను ఇందులో పొందుపరిచారు. చారియట్-1 ఎల్ఎల్ఎం అనేది మిక్చర్-ఆఫ్-ఎక్స్‌పర్ట్స్ విధానంలో పనిచేసే 11 బిలియన్ పారామీటర్ల మోడల్ కాగా, ప్రతి టోకెన్‌కు నాలుగు బిలియన్ యాక్టివ్ పారామీటర్లతో పనిచేస్తుంది. విభిన్న కంప్యూటింగ్ అవసరాలకు తగినట్లుగా 10.7 బిలియన్, 1.7 బిలియన్ మరియు 745 మిలియన్ పారామీటర్ల వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది.
భారతదేశ భాషా వైవిధ్యం, సామాజిక మరియు సాంకేతిక అవసరాలకు తగినట్లుగా ఈ మోడల్స్‌ను తీర్చిదిద్దారు. ఆంగ్లంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, ఒడియా వంటి పది భారతీయ భాషలలో మాటలను రూపొందించే సామర్థ్యం వీటికి ఉంది. విదేశీ ఏఐ మౌలిక సదుపాయాలపై ఆధారపడటాన్ని తగ్గించి, ఆరోగ్యం, వ్యవసాయం, విద్య మరియు పాలన రంగాలలో స్వదేశీ ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ఈ చొరవ దోహదపడుతుందని సాంకేతిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.