హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌యే విశ్వసనీయ భాగస్వామి
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
సూర్య జాతీయ డెస్క్: హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ఒక విశ్వసనీయ భాగస్వామిగా మరియు అత్యవసర సమయంలో స్పందించే తొలి దేశంగా నిలిచిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలోని నౌసేనా భవన్‌లో మంగళవారం ప్రారంభమైన నావికాదళ కమాండర్ల ద్వైవార్షిక సమావేశం 2026 రెండో ఎడిషన్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మారుతున్న అంతర్జాతీయ సంక్లిష్ట పరిస్థితుల మధ్య భారత నావికాదళం కేవలం తీరప్రాంత సరిహద్దుల రక్షణకే పరిమితం కాకుండా ప్రాంతీయ స్థిరత్వం, ఆర్థిక భద్రత మరియు వ్యూహాత్మక విస్తరణలో కీలక పాత్ర పోషిస్తోందని ఆయన కొనియాడారు. వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో నావికాదళం ఒక ప్రధాన వ్యూహాత్మక చోదక శక్తిగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
భారతీయ నావికాదళం దక్షిణ చైనా సముద్రం, మధ్యధరా సముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం వరకు విస్తరించి బ్లూ-వాటర్ శక్తిగా అవతరించిందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. మన దేశం దిగుమతి చేసుకునే ముడి చమురులో దాదాపు 85 నుండి 90 శాతం, సహజ వాయువులో 50 శాతం సముద్ర మార్గాల ద్వారానే రవాణా అవుతున్నాయని తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభ సమయంలో ఆపరేషన్ ఊర్జా సురక్ష ద్వారా భారతీయ నౌకల సురక్షిత ప్రయాణాన్ని నావికాదళం ఖరారు చేసిందని గుర్తుచేశారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంలో భాగంగా ఇటీవల కమిషన్ చేసిన యుద్ధనౌకల్లో 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని ఉపయోగించామని, రాబోయే రోజుల్లో స్నేహపూర్వక విదేశాలకు కూడా నౌకలను ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
చరిత్రలోనే అత్యధికంగా 2026 సంవత్సరంలో ఏకంగా 18 సరికొత్త యుద్ధనౌకలను నావికాదళంలోకి చేర్చుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, ఇది దేశీయ నౌకా నిర్మాణ రంగానికి నిదర్శనమని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. నావికాదళంలో మహిళా అధికారుల భాగస్వామ్యం పెరుగుతోందని, ఫ్రంట్‌లైన్ యుద్ధనౌకలతో పాటు నావికా సాగర్ పరిక్రమ వంటి సాహసయాత్రల్లో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని అభినందించారు. నావికాదళం కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ 154 బాధ్యతలను స్వీకరించడం ద్వారా ప్రాంతీయ సహకార భద్రతకు పెద్దపీట వేసిందన్నారు. మన సముద్ర జలాలు సురక్షితంగా ఉన్నప్పుడే దేశం సురక్షితంగా ఉంటుందని, ఆ దిశగా త్రివర్ణ పతాకం భద్రత మరియు నమ్మకానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.