గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట రూ.1.27 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి వాసంశెట్టి సుభాష్
రామచంద్రపురం మేజర్ న్యూస్ :రామచంద్రపురం రూరల్ మండలంలో రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ మంగళవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో మొత్తం రూ.1.27 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించి, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను చాటిచెప్పారు.
రూ.40 లక్షలతో తోటపేటలో స్వర్ణ గ్రామం సచివాలయ భవనంతోటపేట గ్రామంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన స్వర్ణ గ్రామం (సచివాలయ భవనాన్ని) మంత్రి సుభాష్ ప్రారంభించారు. గ్రామస్థులకు ప్రభుత్వ సేవలు మరింత చేరువగా, సులభంగా అందేలా సచివాలయ వ్యవస్థ పనిచేయాలని మంత్రి సూచించారు.గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా, గ్రామస్థాయిలోనే ప్రభుత్వ సేవలు అందేలా సచివాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
వెల్ల గ్రామంలో రూ.50 లక్షల అంచనా విలువతో నిర్మించిన సీసీ రోడ్డు, కల్వర్టు పనులకు మంత్రి సుభాష్ ప్రారంభించారు. గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీ, కల్వర్టుల నిర్మాణంతో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్టులు బాగుంటేనే అభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడుతున్నాం. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులను వేగంగా పూర్తి చేసారని మంత్రి వెల్లడించారు.
వేగాయమ్మపేటలో 13 కల్వర్టులు.. రూ.27.85 లక్షలు :వేగయమ్మపేట గ్రామంలో రూ.27.85 లక్షల అంచనా వ్యయంతో 13 కల్వర్టుల నిర్మాణ పనులకు మంత్రి సుభాష్ శ్రీకారం చుట్టారు. వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో నీటి ప్రవాహం కారణంగా ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించేందుకు కల్వర్టుల నిర్మాణం చేపట్టిన్నట్లు తెలిపారు.అంగన్‌వాడీ భవనాలకు రూ.10 లక్షలు :మాలపాడు, తోటపేట గ్రామాల్లో అంగన్‌వాడీ భవనాల నిర్మాణ పనులను ఆధునికరించి ఒక్కో గ్రామానికి రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షలతో పునర్నిర్మించిన భవనాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ చిన్నారులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో విద్య, పౌష్టికాహారం అందేలా అంగన్‌వాడీ కేంద్రాలను అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు
.చిన్నారుల భవిష్యత్తు కోసం చేసే ప్రతి పని ముఖ్యమే. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. గ్రామాల్లో అవసరమైన చోట మౌలిక వసతులను దశలవారీగా కల్పిస్తాం అని మంత్రి సుభాష్ అన్నారు. రామచంద్రపురం రూరల్ మండలంలోని ప్రతి గ్రామంలో ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపడుతున్నామని మంత్రి సుభాష్ తెలిపారు. మంజూరైన పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, జనసేన ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు, పంచాయతీరాజ్ డీఈ శ్రీనివాస్, ఎంపీడీవో పద్మజ్యోతి, ఐసిడిఎస్ సిడిపిఓ వరహాలక్ష్మి, ఏఈ యేసురత్నం, కూటమి పార్టీ నాయకులు, అధికారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.