ఢిల్లీలో జెన్-జీ నిరసనకారిణి నేహా బోరా అరెస్ట్
సూర్య జాతీయ డెస్క్: దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసంటూ తలపెట్టిన భారీ నిరసన కార్యక్రమాల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల్లో ప్రముఖ జెన్-జీ విద్యార్థి నేత, ఐసా జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా యువత గళాన్ని వినిపిస్తూ వస్తున్న నేహా బోరాను పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాజకీయ వర్గాలలో తీవ్ర కలకలం రేపింది. ఈ నిరసనల సందర్భంగా ఢిల్లీ వ్యాప్తంగా వేలాది మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం గమనార్హం.
ఢిల్లీలోని విభిన్న ప్రాంతాల నుంచి జంతర్ మంతర్ వైపు సాగిన ర్యాలీలను పోలీసులు తీవ్రంగా అణచివేశారు. దేశంలో భావప్రకటన స్వేచ్ఛపై హక్కులను హరిస్తున్నారని, అప్రకటిత అత్యవసర పరిస్థితి కొనసాగుతోందని ఆందోళనకారులు మండిపడ్డారు. విద్యార్థులు, యువజన సంఘాల నాయకులు చేపట్టిన ఈ నిరసనలకు విశేష స్పందన లభించడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెట్రో స్టేషన్లలో ఆంక్షలు విధించడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసమే తాము రోడ్డెక్డామని, ఎన్ని నిర్బంధాలు ఎదురైనా పోరాటం ఆగదని నేత లు స్పష్టం చేశారు.
యువతలో పెరుగుతున్న నిరుద్యోగం, విద్యా రంగంలోని సమస్యలు మరియు ప్రభుత్వ విధానాలపై నిరసనలు మళ్లీ ఉధృతమవుతున్నాయి. ముఖ్యంగా సాంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా యువత నేతృత్వంలో సాగుతున్న ఈ ఉద్యమాలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అరెస్టుల పర్వంపై పలు విపక్ష పార్టీల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాయడం సరికాదని, వెంటనే అరెస్టు చేసిన వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ పరిణామాలు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీశాయి. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఈ ఆందోళనలకు మద్దతుగా కదిలివస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థల స్వయంప్రతిపత్తిని కాపాడుకోవడానికి యువత పెద్ద ఎత్తున ముందుకు రావడం దేశ భవిష్యత్తు రాజకీయాలపై స్పష్టమైన సంకేతాలను ఇస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు రాబోయే కాలంలో మరింత విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.