భారత్‌లో రాబోయే 6 నెలల్లో 15,800 అదనపు వేడి మరణాలు!
సూర్య జాతీయ డెస్క్: విశ్వవిద్యాలయ పరిశోధకులు రూపొందించిన నివేదిక ప్రకారం, రాబోయే ఆరు నెలల్లో తీవ్రమైన 'సూపర్ ఎల్ నినో' (Super El Niño) ప్రకోపించడం వల్ల భారత్‌లో దాదాపు 15,800 అదనపు వేడి సంబంధిత మరణాలు సంభవించే అవకాశం ఉందని షికాగో యూనివర్సిటీకి చెందిన 'క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్' శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఎల్ నినో తొలి భాగంలో సుమారు 4,51,000 మంది ప్రాణాలు కోల్పోవచ్చని ఈ అధ్యయనం హెచ్చరిస్తోంది.
శాస్త్రవేత్తల ప్రకారం, సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే నమోదయ్యే తీవ్రమైన ఉష్ణోగ్రతల వ్యత్యాసాలు మరియు చారిత్రక మరణాల డేటాను విశ్లేషించి ఈ గణాంకాలను రూపొందించారు. వచ్చే డిసెంబర్ నుండి ఫిబ్రవరి మధ్య కాలంలోనే దాదాపు 7,400 మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని, సాధారణంగా చలికాలం అయ్యే ఈ సమయంలో కూడా వాతావరణంలో తీవ్రమైన అసాధారణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.
ఈ పరిస్థితిపై ఎయిమ్స్ (AIIMS) పబ్లిక్ హెల్త్ ప్రొఫెసర్ డాక్టర్ హర్షల్ రమేష్ సాల్వే స్పందిస్తూ, ఈ నివేదిక ఉష్ణ తరంగాల వల్ల మానవ ఆరోగ్యంపై పడే తీవ్ర ప్రభావాన్ని స్పష్టంగా చూపుతోందన్నారు. ప్రభుత్వం తక్షణమే అన్ని స్థాయిలలో హీట్ యాక్షన్ ప్లాన్స్ (HAPs) అమలు చేయాలని, వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరియు ఎండలో పనిచేసే కార్మికులకు ప్రాధాన్యతనిస్తూ రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.