ఇబ్రహీంపట్నం మహిళ హత్య కేసు
విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. భవానిపురానికి చెందిన షఫి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ అయినట్లు సమాచారం. మృతురాలు కళ్యాణితో షఫికి వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
కొంతకాలం క్రితం కళ్యాణి తన కుమారుడిని షఫికి అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే కుమారుడి విషయంలో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. తన కుమారుడిని తిరిగి తనకు అప్పగించాలని కళ్యాణి షఫిపై పదేపదే ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
10 రోజుల క్రితమే హత్య జరిగినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి కెనాల్లో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసును ఛేదించిన పోలీసులు నిందితుడి పాత్రపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.