జోధ్‌పూర్‌లో ఏజీటీఎఫ్ మెరుపు దాడి: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ షార్ప్ షూటర్లు ఇద్దరు అరెస్ట్, రూ.10 లక్షల రివార్డు
సూర్య జాతీయ డెస్క్: రాజస్థాన్ పోలీసుల యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్ ఫోర్స్ (ఏజీటీఎఫ్) జోధ్‌పూర్‌లో నిర్వహించిన వ్యూహాత్మక ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర నేర ముఠా లారెన్స్-ఆర్జూ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు మోస్ట్ వాంటెడ్ షార్ప్ షూటర్లు పట్టుబడ్డారు. పంజాబ్ పోలీసులచే ఒక్కొక్కరిపై రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 10 లక్షల రివార్డు ఉన్న జస్కరణ్ సింగ్ అలియాస్ కట్టా, రాజిందర్ సింగ్ అలియాస్ బిల్లా అనే నిందితులను జోధ్‌పూర్ పోలీస్ కమిషనరేట్ సహకారంతో ఏజీటీఎఫ్ బృందం అదుపులోకి తీసుకుంది. నగరంలోని కైలాష్ నగర్ పరిధిలోని ఒక హోటల్ గదిలో నకిలీ పేర్లు, తప్పుడు ఆధార్ కార్డులతో తలదాచుకున్న వీరిని పక్కా సమాచారంతో అధికారులు వలపన్ని పట్టుకున్నారు.
ఈ ఆపరేషన్ వివరాలను ఏజీటీఎఫ్ అదనపు డీజీపీ దినేష్ ఎం.ఎన్. వెల్లడిస్తూ, నిందితులిద్దరూ పంజాబ్‌లోని అబోహర్, ఫాజిల్కాలలో వస్త్ర వ్యాపారి సంజయ్ వర్మ, సాహిల్ సేన్ హత్యలతో పాటు పలు దారుణ నేరాలకు పాల్పడి నేపాల్‌కు పారిపోయారని తెలిపారు. సుమారు ఏడాదిన్నర పాటు నేపాల్‌లో దాక్కున్న ఈ షూటర్లు, అక్కడ ఒత్తిడి పెరగడంతో తిరిగి మధ్యప్రదేశ్, సిరోహి మీదుగా రాజస్థాన్‌లోకి ప్రవేశించారు. జోధ్‌పూర్‌లోని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తను లక్ష్యంగా చేసుకుని దాడి చేసి, కోట్ల రూపాయల మేర దోపిడీ లేదా బెదిరింపులకు పాల్పడేందుకు వారు కుట్ర పన్నినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వీరి కదలికలపై నిఘా ఉంచిన ప్రత్యేక బృందం నిందితులు దాడికి పాల్పడకముందే అదుపులోకి తీసుకుని పెను ప్రమాదాన్ని తప్పించింది.
అరెస్టు సమయంలో నిందితుల నుంచి మారణాయుధాలు, రివాల్వర్, లైవ్ రౌండ్లు, సుమారు 83 గ్రాముల నల్లమందు, నగదుతో పాటు పలు నకిలీ గుర్తింపు పత్రాలు, సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌లో వీరిపై హత్యలు, హత్యాయత్నాలు, దారిదోపిడీలు, ఆయుధ చట్టం కింద దాదాపు 12 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని, హర్యానా, ఢిల్లీ, యూపీ పోలీసులు కూడా వీరి కోసం గాలిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. జైళ్లలో ఉన్న లారెన్స్ ముఠా ప్రధాన నేతల ఆదేశాలతో వీరు నేరాలు చేసి పరారవుతున్నట్లు గుర్తించారు. ఈ ముఠా వెనుక ఉన్న స్థానిక నెట్‌వర్క్, టార్గెట్ వివరాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.