వీసారహిత ప్రవేశంతో మలేసియాలో ఉద్యోగాల వేట వద్దు: భారత పౌరులకు హైకమిషన్ కీలక హెచ్చరిక
సూర్యజాతీయ డెస్క్: మలేసియా ప్రభుత్వం కల్పిస్తున్న 30 రోజుల వీసా రహిత ప్రవేశ సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తూ ఉద్యోగాలు వెతుక్కునేందుకు వెళ్లవద్దని భారత పౌరులను కౌలాలంపూర్లోని భారత హైకమిషన్ తీవ్రంగా హెచ్చరించింది. వీసా రహిత సౌకర్యం కేవలం పర్యాటకం, సందర్శనార్థం మాత్రమేనని, దీనిని ఉపయోగించి ఉద్యోగాల్లో చేరడం మలేసియా ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం తీవ్ర నేరమని స్పష్టం చేసింది. నకిలీ ఉద్యోగ ఏజెంట్ల మాయమాటలు నమ్మి పర్యాటక వీసాలపై వెళ్లి చిక్కుల్లో పడవద్దని, సరైన వర్క్ పర్మిట్ లేదా వీసా విత్ రిఫరెన్స్ (వీడీఆర్) లేకుండా ఎలాంటి ఉద్యోగ ప్రయాణాలు చేయరాదని అధికారిక ప్రకటనలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇటీవలకాలంలో మోసపూరిత ఏజెంట్లు భారతీయ నిరుద్యోగులకు తప్పుడు హామీలు ఇచ్చి వీసా రహిత ప్రవేశం ద్వారా మలేసియాకు పంపిస్తున్న ఘటనలు గణనీయంగా పెరిగినట్లు హైకమిషన్ గుర్తించింది. ఇలాంటి వారు గడువు ముగిసినా అక్కడే ఉంటూ అక్రమ వలసదారులుగా మారుతున్నారని, తీవ్ర దోపిడీకి గురవడంతో పాటు స్థానిక పోలీసుల అరెస్టులు, జైలు శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. చెల్లుబాటు అయ్యే అధికారిక వర్క్ పర్మిట్ ఉంటేనే మలేసియా చట్టాల ప్రకారం కార్మికులకు చట్టపరమైన రక్షణ లభిస్తుందని, ఎలాంటి అనధికారిక మధ్యవర్తులను నమ్మి జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని విజ్ఞప్తి చేసింది.
అదేసమయంలో నిజమైన పర్యాటకులు కూడా మలేసియా విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ప్రయాణానికి కనీసం ఆరు నెలల చెల్లుబాటు ఉన్న పాస్పోర్ట్, కన్ఫర్మ్ అయిన రిటర్న్ విమాన టికెట్లు, హోటల్ బుకింగ్ వివరాలు దగ్గర ఉంచుకోవాలని స్పష్టం చేసింది. వీటితో పాటు మలేసియా చేరుకోవడానికి మూడు రోజుల ముందుగానే ఆన్లైన్ ద్వారా 'మలేసియా డిజిటల్ అరైవల్ కార్డ్' (ఎండీఏసీ) సమర్పించి ఉండాలని, ఈ పత్రాలు సక్రమంగాలేని పక్షంలో విమానాశ్రయం నుంచే తిప్పి పంపే అవకాశం ఉందని భారత రాయబార కార్యాలయం గుర్తుచేసింది.