V4+భారత్ తొలి విదేశాంగ మంత్రుల భేటీ
‘చారిత్రాత్మక సందర్భం’గా అభివర్ణించిన జైశంకర్!
సూర్య అంతర్జాతీయ డెస్క్: ఐక్యరాజ్యసమితి సాధారణ సభ (UNGA) 81వ సమావేశాల సందర్భంగా న్యూయార్క్‌లో భారత్ మరొక కీలక దౌత్య ఘట్టానికి శ్రీకారం చుట్టింది. మధ్య ఐరోపాలోని నాలుగు శక్తివంతమైన దేశాల కూటమి అయిన 'విసెగ్రాడ్ గ్రూప్' (V4—చెక్ రిపబ్లిక్, హంగేరీ, పోలాండ్, స్లోవేకియా) మరియు భారత్ విదేశాంగ మంత్రుల మధ్య తొలిసారిగా అధికారిక సమావేశం జరిగింది. ఈ భేటీపై భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ స్పందిస్తూ.. ఇది ఒక "నూతన చారిత్రాత్మక సందర్భం" అని అభివర్ణించారు.
ఈ ప్రాధాన్య సమావేశంలో విదేశాంగ మంత్రి జైశంకర్‌తో పాటు పోలాండ్ ఉప ప్రధాని రాడెక్ సికోర్స్కీ, హంగేరీ ఉప ప్రధాని అనితా ఓర్బన్, స్లోవేకియా విదేశాంగ మంత్రి జురాజ్ బ్లనార్, చెక్ విదేశాంగ మంత్రి పెటర్ మాసింకా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐదు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక, రక్షణ మరియు సాంకేతిక రంగాలలో భాగస్వామ్యాన్ని పునరుద్ధరించుకోవడానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేశారు. భారత్-యూరోపియన్ యూనియన్ (EU) సంబంధాలు వేగంగా విస్తరిస్తున్న వేళ, V4 కూటమితో వ్యాపార అవకాశాలను పెంచేందుకు ఒక ప్రత్యేక ‘వార్షిక బిజినెస్ ఫోరమ్’ను ప్రారంభించాలని, అలాగే ప్రతి ఏటా ఐదు దేశాల విదేశాంగ మంత్రులు క్రమం తప్పకుండా సమావేశం కావాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.
ఈ భేటీలో ప్రధానంగా రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. V4 దేశాలకు రక్షణ మరియు పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలో ఉన్న బలమైన రికార్డును దృష్టిలో ఉంచుకుని, ఉమ్మడి భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్తామని జైశంకర్ చెప్పారు. వీటితో పాటు అంతరిక్షం, కనెక్టివిటీ, ఉన్నత విద్య, ఆవిష్కరణలు మరియు ప్రజల రాకపోకలు (పీపుల్-టు-పీపుల్ మొబిలిటీ) వంటి పలు వినూత్న అంశాలపై విస్తృతంగా చర్చించారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు ప్రస్తుత ప్రపంచ సంక్షోభాలైన ఉక్రెయిన్ వివాదం, గల్ఫ్ ప్రాంత పరిణామాలపై కూడా మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సమావేశం అనంతరం స్లోవేకియా విదేశాంగ మంత్రి జురాజ్ బ్లనార్ మాట్లాడుతూ భారత్‌కు తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. "గ్లోబల్ సౌత్‌లో కీలక భాగస్వామిగా, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న అగ్రరాజ్యంగా ఉన్న భారతదేశం.. ఐరాస భద్రతా మండలిలో (UNSC) శాశ్వత సభ్యురాలిగా నిర్ణయాధికార పీఠంపై కూర్చోవాలనే విషయంలో V4 దేశాలమంతా ఏకీభవిస్తున్నాము" అని స్పష్టం చేశారు. ఈ మద్దతు ఐరాసలో భారత్ దౌత్య బలానికి మరింత ఊతమిచ్చినట్లైంది.