అమెరికాలో ముగ్గురు పాలస్తీనా విద్యార్థులపై కాల్పుల కేసు: నిందితుడు జాసన్ ఈటన్ దోషిగా నిర్ధారణ
సూర్య అంతర్జాతీయ డెస్క్: అమెరికాలోని వెర్మోంట్ రాష్ట్రంలో 2023లో ముగ్గురు పాలస్తీనా కాలేజీ విద్యార్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన కేసులో 51 ఏళ్ల నిందితుడు జాసన్ ఈటన్ను న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. బర్లింగ్టన్లోని వెర్మోంట్ యూనివర్సిటీ ప్రాంగణ సమీపంలో జరిగిన ఈ దారుణ ఘటనలో ముగ్గురు విద్యార్థులను హత్య చేసేందుకు ప్రయత్నించాడనే మూడు అభియోగాలపై జ్యూరీ విచారణ చేపట్టింది. తనకు మానసిక స్థితి సరిగా లేదని, అంతర్గత శక్తులు ఇచ్చిన ఆదేశాల మేరకే కాల్పులు జరిపానని నిందితుడి తరఫు న్యాయవాదులు వాదించినప్పటికీ, జ్యూరీ ఆ వాదనలను పూర్తిగా తోసిపుచ్చి జాసన్ ఈటన్ను హత్యాప్రయత్నం కేసులో ముద్దాయిగా ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్పు వెలువరించింది.
2023 నవంబర్ థాంక్స్ గివింగ్ సెలవుల సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న హిషమ్ అవర్తానీ, తహ్సీన్ అలియాహ్మద్, కిన్నన్ అబ్దల్హమీద్ అనే ముగ్గురు పాలస్తీనా యువకులపై ఈటన్ తుపాకీతో విరుచుకుపడ్డాడు. ఈ దాడిలో అవర్తానీ ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆయన నడుము కింది భాగం శాశ్వతంగా చచ్చుబడి చక్రాల కుర్చీకే పరిమితం కాగా, మిగిలిన ఇద్దరు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రరూపం దాల్చిన సమయంలో కేవలం అరబ్ సంప్రదాయ దుస్తులు ధరించారనే ద్వేషంతోనే ఈ దాడికి పాల్పడ్డారని బాధితుల కుటుంబాలు ఆరోపించాయి. విచారణ సందర్భంగా నిందితుడు చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యలే అతని నేర స్వభావాన్ని నిరూపిస్తున్నాయని బాధితులు పేర్కొన్నారు.
మూడేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం న్యాయం గెలిచిందని బాధితుల కుటుంబాలు ఉమ్మడి ప్రకటనలో హర్షం వ్యక్తం చేశాయి. ఈ తీర్పు తమ పిల్లలు అనుభవించిన భయానక క్షణాలను, శారీరక వైకల్యాన్ని తుడిచిపెట్టలేకపోయినా, ఈ కిరాతక దాడికి జాసన్ ఈటనే పూర్తి బాధ్యుడని చట్టం తేల్చిచెప్పడం ఊరటనిచ్చిందని వారు పేర్కొన్నారు. దోషిగా తేలిన ఈటన్కు జీవిత ఖైదు పడే అవకాశముందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తుండగా, శిక్షా ఖరారు తేదీని న్యాయస్థానం త్వరలోనే ప్రకటించనుంది.