ఉక్రెయిన్ పవర్ గ్రిడ్‌పై రష్యా భారీ క్షిపణి దాడులు
సూర్య అంతర్జాతీయ డెస్క్: అబుదాబి వేదికగా జరగనున్న కీలకమైన శాంతి చర్చలకు కేవలం కొన్ని రోజుల ముందు రష్యా ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. ఉక్రెయిన్ విద్యుత్ మరియు ఇంధన మౌలిక వసతులపై రష్యా బలగాలు వందలాది డ్రోన్లు, డజన్ల కొద్దీ క్షిపణులతో ఉమ్మడి దాడులకు పాల్పడ్డాయి. ఈ భారీ దాడుల కారణంగా రాజధాని కీవ్‌తో పాటు కనీసం ఆరు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని, దేశవ్యాప్తంగా అంధకారం అలుముకుందని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో పవర్ గ్రిడ్లను లక్ష్యంగా చేసుకుని రష్యా చేస్తున్న ఈ దాడులు తీవ్ర మానవతా సంక్షోభానికి దారితీసే అవకాశం ఉంది.
ఈ దాడుల నేపథ్యంలో జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ బెర్లిన్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. శాంతి చర్చల వాతావరణాన్ని దెబ్బతీసేలా మాస్కో వ్యవహరిస్తోందని, ఇలాంటి అణచివేత చర్యలను కట్టిపెట్టి చర్చల మార్గానికి రావాలని మెర్జ్ రష్యాను గట్టిగా హెచ్చరించారు. ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి, యూరప్ భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, ఉద్దేశపూర్వకంగా పౌరులను, పవర్ గ్రిడ్లను టార్గెట్ చేయడం ద్వారా రష్యా యుద్ధ కాంక్షను చాటుకుంటోందని జెలెన్స్కీ ఆరోపించారు.
సైనిక కర్మాగారాలకు విద్యుత్నందించే గ్రిడ్లనే లక్ష్యంగా చేసుకున్నట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సమర్థించుకున్నప్పటికీ, సాధారణ పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి సరఫరా మరియు రవాణా వ్యవస్థలు కూడా దెబ్బతినడంతో ప్రజలు త్రీవ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ సమాజం మరియు అమెరికా మధ్యవర్తిత్వంతో అబుదాబిలో జరగాల్సిన చర్చలకు ముందు ఈ దాడులు జరగడం ప్రపంచ దేశాల్లో ఆందోళన రేకెత్తించింది. ఈ పరిస్థితుల మధ్య రాబోయే దౌత్యపరమైన చర్చలు ఏ విధంగా ముందుకు వెళ్తాయనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.