అమెరికా ఎన్నికల్లో 50 రాష్ట్రాల్లో ఓటింగ్ మానిటర్లను రంగంలోకి దించిన న్యాయశాఖ
సూర్య అంతర్జాతీయ డెస్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల పోలింగ్ పారదర్శకంగా జరిగేలా చూసేందుకు డోనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ఫెడరల్ న్యాయశాఖ (డీఓజే) నభూతో నభవిష్యతి రీతిలో చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని 50 రాష్ట్రాలలో ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు సుమారు 1,000 మంది ఎన్నికల మానిటర్లను మోహరిస్తున్నట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. అమెరికా చరిత్రలోనే అత్యంత భారీ ఎత్తున ఫెడరల్ అధికారులను ఎన్నికల పర్యవేక్షణకు పంపుతుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
గతంలో ఓటు హక్కు ఉల్లంఘనలు లేదా వివక్షకు గురైన ప్రాంతాలకే పరిమితమైన ఫెడరల్ పర్యవేక్షణను ఈసారి దేశమంతటికీ విస్తరించారు. ఫెడరల్ ఓటింగ్ హక్కుల చట్టాలకు లోబడి పోలింగ్ జరుగుతుందో లేదో తనిఖీ చేయడమే ఈ మానిటర్ల ప్రధాన బాధ్యత అని న్యాయశాఖ స్పష్టం చేసింది. అయితే ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం లేదా ఎన్నికల ప్రక్రియలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం వంటి పనులకు వీరికి ఎలాంటి అనుమతి లేదని వెల్లడించింది. కేవలం పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులను గమనించి నివేదికలను సమర్పించడం మాత్రమే వీరి విధి అని పేర్కొంది.
ట్రంప్ యంత్రాంగం తీసుకున్న ఈ ఊహించని నిర్ణయంపై డెమోక్రాట్లు మరియు ఓటింగ్ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫెడరల్ అధికారుల విస్తృత మోహరింపు ఓటర్లపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందని విమర్శకులు వాదిస్తున్నారు. మరోవైపు పోలింగ్ కేంద్రాల్లోకి ఫెడరల్ అధికారుల ప్రవేశంపై స్థానిక చట్టాల మేరకు కఠిన నిబంధనలు ఉంటాయని, రాష్ట్ర నిబంధనలకు లోబడి మాత్రమే మానిటర్లు వ్యవహరించాలని పలు రాష్ట్రాల ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఈ రికార్డు స్థాయి మోహరింపు అమెరికా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.