యాక్షన్ సీన్‌లో అసభ్యకర దుస్తులు వేసుకోమన్నారంటూ రాధిక ఆప్టే ఆవేదన
బాలీవుడ్ బోల్డ్ అండ్ ట్యాలెంటెడ్ నటి రాధిక ఆప్టే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సినిమా షూటింగ్‌లలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ఒక చిత్రంలో యాక్షన్ సీన్ చేసే సమయంలో మేకర్స్ తనను కేవలం ఇన్నర్ వేర్ లేదా బటన్స్ తీసేసిన షర్ట్‌తో నటించాలని అడిగానని తెలిపారు. ఇలాంటి చివరి నిమిషపు డిమాండ్లు నటీమణులకు ఎంతో మానసిక క్షోభను కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే పాత్ర డిమాండ్ గురించి స్పష్టంగా చెప్పాలని, కావాలంటే న్యూడిటీ గురించి కూడా ముందే క్లారిటీ ఇవ్వాలని రాధిక అభిప్రాయపడ్డారు. కానీ కొందరు మాత్రం చివరి నిమిషంలో ఇలాంటి ఇబ్బందికరమైన డిమాండ్లతో నటులను ఒత్తిడికి గురి చేస్తారని చెప్పారు. ఈ తరహా పరిస్థితులు తీవ్ర నిరాశను, అసౌకర్యాన్ని కలిగిస్తాయని ఆమె ఆరోపించారు.
ఇక సినిమా రంగంలో నటీనటులకు అండగా ఉండాల్సిన 'ఇంటిమసీ కోఆర్డినేటర్లు' కూడా చాలాసార్లు నిర్మాతల ఒత్తిడి కారణంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యాక్టర్ల పక్షాన నిలబడిన కొందరు కోఆర్డినేటర్లను ఉద్యోగాల నుండి తొలగించిన సందర్భాలు కూడా తాను చూశానని ఆమె వెల్లడించారు. పరిశ్రమలో ఇంకా ఇలాంటి పరిస్థితులు మారాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.