క్రిస్మస్ కానుకగా ‘రియాలిటీ’ విడుదల.. ‘రుత్తూ’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, డైరెక్టర్ కిరణ్ అబ్బవరం!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రియాలిటీ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సురేష్ యెర్రా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ అలాగే భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన మొదటి సింగిల్ ‘భజ గోవిందం’ పాట సోషల్ మీడియాలో చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో సినిమాలోని రొమాంటిక్ కోణాన్ని ఆవిష్కరిస్తూ రూపొందించిన రెండో సింగిల్ ‘రుత్తూ’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ అత్యంత వైభవంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో హీరో, దర్శకుడు కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకంగా నిలిచే ఈ కుటుంబ కథా చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ కుటుంబంతో కలిసి థియేటర్లలో చూసి ఆనందించేలా తెరకెక్కించామని తెలిపారు. తొలి పాట భజ గోవిందంతో పాటు తాజాగా విడుదలైన రుత్తూ పాటకు కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. కేవలం 53 రోజుల్లో అత్యున్నత సాంకేతిక నిపుణుల సహకారంతో సినిమాను పూర్తి చేశామని, క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
నిర్మాత సుధాకర్ చాగంటి మాట్లాడుతూ, ఇరవై ఏళ్ల తన సినీ ప్రయాణంలో తొలిసారిగా ఇంతటి విలువైన కుటుంబ కథా చిత్రాన్ని నిర్మించడం ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. కిరణ్ అబ్బవరం రాసిన ప్రతి డైలాగ్ ఎంతో హృద్యంగా ఉంటుందని, ఇప్పటికే సినిమాకు సంబంధించిన అన్ని వ్యాపార లావాదేవీలు పూర్తయ్యాయని తెలిపారు. నూతన నటి దేవికా భట్ మాట్లాడుతూ, తన తొలి సినిమానే ఇంత మంచి చిత్రంలో చేసే అవకాశం రావడం అదృష్టమని, థియేటర్లలో ప్రేక్షకులు తప్పకుండా ఈ సినిమాను ఆదరిస్తారని కోరారు. ఈ వేడుకలో సినిమాటోగ్రాఫర్ విశ్వాస్ డేనియల్, గీత రచయితలు పూర్ణాచారి, సనారే తదితరులు పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.