ఇడుపు కాయితం మంచి ఫ్యామిలీ డ్రామా ఫిలిం.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత బన్నీ వాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: వర్సటైల్ నటుడు ప్రియదర్శి హీరోగా, ఫోక్ సాంగ్స్ ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ సంయుక్తంగా బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా హైదరాబాద్‌లో టీజర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ, ఈ సినిమా టైటిల్ వివాదాల నుంచి మొదలైందని, అయితే ప్రతి ఇంటిలో జరిగే చిన్న చిన్న విషయాలను కడుపుబ్బా నవ్విస్తూ, ఆలోచింపజేసేలా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారని తెలిపారు. కొత్తగా పెళ్లయిన జంటలు తమ అత్తమామలతో కలిసి వచ్చి థియేటర్లలో చూడదగ్గ అద్భుతమైన ఫ్యామిలీ డ్రామా ఇదని, ప్రేక్షకుల ప్రతి టికెట్ డబ్బుకు పూర్తి న్యాయం జరిగే సినిమా అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హీరో ప్రియదర్శి ఈ కథను తమ వద్దకు తీసుకువచ్చారని, ఈ సినిమా విజయాల క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుందని ప్రశంసించారు.
హీరో ప్రియదర్శి మాట్లాడుతూ, నిజాయితీగా చెప్పే ఏ కథయినా ప్రేక్షకులకు కచ్చితంగా కనెక్ట్ అవుతుందని, ఇది మనందరి ఇళ్లలో జరిగే సహజమైన కథ అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళ్లడంలో నిర్మాత తబిత సుకుమార్, బన్నీ వాస్ అందించిన ప్రోత్సాహం ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పారు. దర్శకుడు వంశీరెడ్డి చక్కటి భావోద్వేగాలతో ఈ సినిమాను అద్భుతంగా మలిచారని, హీరోయిన్ నాగదుర్గ నటిగా మంచి పేరు తెచ్చుకుంటుందని కొనియాడారు. సినిమా చూస్తున్నంతసేపు ప్రతి ప్రేక్షకుడూ తమ కుటుంబ కథలా రిలేట్ చేసుకుంటారని తెలిపారు.
దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి మాట్లాడుతూ, ఇడుపుకాయితం అంటే జంట విడిపోవడానికి రాసుకునే పత్రం మాత్రమే కాకుండా, విడిపోయిన తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి దొరికే ఒక సర్టిఫికెట్ లా భావించాలనే కోణంలో ఈ టైటిల్ పెట్టామని వివరించారు. నిర్మాత తబిత సుకుమార్ మాట్లాడుతూ, చిన్ననాటి నుంచి తాను చూసిన పెళ్లి సంప్రదాయాలు, పెద్దల మాటలు అన్నీ ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని, అందరికీ నచ్చే బ్యూటిఫుల్ స్టోరీ ఇదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటీనటులు విద్యాసాగర్, విజయ, మైమ్ మధు, వినోద్ బాల, చంద్రవ్వ తదితరులు సినిమా విశేషాలను పంచుకుంటూ డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల కానున్న తమ చిత్రాన్ని ఆదరించాలని కోరారు.