బిగ్ బాస్ హౌస్‌లో కాలేజ్ ర్యాగింగ్ రచ్చ.. సీనియర్ల పంచులు, నవ్వులు తెప్పిస్తున్న ప్రోమో
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: రియాలిటీ షో బిగ్ బాస్ హౌస్‌లో నాల్గవ వారం ఆట ముగింపు దశకు చేరుకుంది. మరో కొన్ని గంటల్లో వీకెండ్ ఎపిసోడ్ ప్రారంభం కానుండగా, నాగార్జున హోస్ట్‌గా ఎంట్రీ ఇవ్వనున్న తరుణంలో హౌస్‌లో వాతావరణం వేడెక్కింది. ఈ వారంలో కంటెస్టెంట్ల మధ్య జరిగిన గొడవలు, వాగ్వాదాలపై నాగ్ ఏవిధంగా క్లాస్ పీకనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ప్రోమో హౌస్‌లోని వాతావరణాన్ని ఒక్కసారిగా సరదాగా మార్చేసింది.
తాజా ప్రోమోలో బిగ్ బాస్ హౌస్ అగ్నిపరీక్ష కాలేజ్‌గా మారిపోయిందని చూపించారు. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగిన ఈ సరదా టాస్క్‌లో వంశీ, త్రిగుణ్, సృష్టి, రాంప్రసాద్, నరేశ్ సీనియర్లుగా వ్యవహరించగా, మిగతా సభ్యులు జూనియర్లుగా కనిపించారు. ముఖ్యంగా రోహిత్, షాలిని క్లోజ్‌గా కూర్చోవడాన్ని సీనియర్లు తమదైన శైలిలో ర్యాగింగ్ చేస్తూ నవ్వులు పూయించారు. షాలిని మీ నాన్న ఏం చేస్తుంటారని రాంప్రసాద్ అడగ్గా, ఆమె బొక్కలు ఇరుస్తాడు అని చెప్పడం, పక్కనే ఉన్న నరేశ్ ఏమి మీ నాన్న మటన్ షాప్ పెట్టున్నాడా అంటూ వేసిన సెటైర్లు ప్రేక్షకులను నవ్విస్తున్నాయి.
అంతేకాకుండా ముకేశ్, వర్షిణిల మధ్య జరిగిన సరదా సన్నివేశాలు ఈ ప్రోమోకు హైలైట్‌గా నిలిచాయి. ముకేశ్ వర్షిణిని ముద్దుపెట్టేందుకు ప్రయత్నించగా, సీనియర్లు వెంటనే అలర్ట్ అయ్యి అతడిని ఆటపట్టించారు. శిక్షగా పుష్‌అప్స్ చేయించడంతో పాటు నరేశ్ రంగంలోకి దిగి వేసిన పంచ్‌లతో హౌస్‌మేట్స్ అంతా పడీపడీ నవ్వుకున్నారు. మొత్తానికి ఈ ప్రోమోలో సీనియర్ల ర్యాగింగ్, జూనియర్లపై వేసిన జోకులు, ఫన్నీ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. మరి వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున ఎవరెవరికి ఏవిధంగా క్లాస్ తీసుకుంటారనే అంశంపై వేచి చూడాలి.