వార్షిక ఇంక్రిమెంట్లను రద్దు చేసిన జోహో: సాఫ్ట్వేర్ రంగం భవిష్యత్తు ఆందోళనకరమన్న శ్రీధర్ వెంబు!
సూర్య బిజినెస్ డెస్క్: ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ 'జోహో' (Zoho) తమ ఉద్యోగులకు ఈ ఏడాది వార్షిక వేతన పెంపును (శాలరీ హైక్స్) రద్దు చేస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది. సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో నెలకొన్న అనిశ్చితి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంబంధిత వ్యయాలు విపరీతంగా పెరిగిపోతుండటమే ఇందుకు ప్రధాన కారణమని కంపెనీ సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు వెల్లడించారు.
ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఉద్యోగాల భవిష్యత్తు ఎంతో గందరగోళంగా, ఆందోళనకరంగా (grim) మారిందని ఆయన హెచ్చరించారు. అయితే, పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ సామూహిక లేఆఫ్లను (ఉద్యోగుల తొలగింపులను) నివారించేందుకు జోహో యాజమాన్యం గట్టిగా ప్రయత్నిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగాలను కాపాడటానికే వేతన పెంపులను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొన్నారు.
శ్రీధర్ వెంబు చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదిక 'X' (గతంలో ట్విట్టర్)లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల్లో ఉంటున్న భారతీయ టెక్కీలను స్వదేశానికి తిరిగి వచ్చేయాలని ఇటీవలే ఆయన బహిరంగంగా విజ్ఞప్తి చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. దేశీయంగా ఉద్యోగ భద్రత, వేతనాల పరిస్థితి ఇలా ఉంటే విదేశాల నుంచి ఎందుకు రమ్మన్నారంటూ పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.