చౌకైన పాలసీకి మారితే ఐదేళ్ల ప్రొటెక్షన్ గల్లంతు!
సూర్య పర్సనల్ ఫైనాన్స్ డెస్క్: ప్రీమియం తక్కువగా ఉందనో, ఏజెంట్ల ఆకర్షణీయమైన మాటలు నమ్మి పాత ఆరోగ్య బీమా పాలసీని రద్దు చేసుకుని కొత్త పాలసీకి మారాలని ఆలోచిస్తున్నారా? అయితే మీరు తీవ్రమైన రిస్క్‌లో పడే అవకాశం ఉందని ఆర్థిక, బీమా రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ ప్రీమియంతో లభించే కొత్త పాలసీ కోసం పాత పాలసీని వదులుకుంటే, గత ఐదేళ్లుగా మీరు కష్టపడి సంపాదించుకున్న అతి ముఖ్యమైన చట్టపరమైన రక్షణను కోల్పోయే ప్రమాదం ఉందని స్పష్టం చేస్తున్నారు.
ఐదేళ్ల మోరటోరియం వ్యవధి అంటే ఏమిటి?
భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ నిబంధనల ప్రకారం.. ఒక పాలసీదారుడు నిరంతరాయంగా 60 నెలల పాటు (గతంలో ఇది 8 ఏళ్లుగా ఉండేది, 2024లో ఐదేళ్లకు కుదించారు) ఆరోగ్య బీమా పాలసీని కొనసాగిస్తే 'మోరటోరియం పీరియడ్' వర్తిస్తుంది. ఈ ఐదేళ్ల గడువు పూర్తయిన తర్వాత, దరఖాస్తు ఫారంలో గత అనారోగ్య చరిత్రను ప్రస్తావించలేదనో లేదా పొరపాటు సమాచారం ఇచ్చారనే కారణంతో క్లెయిమ్‌లను తిరస్కరించే హక్కు బీమా కంపెనీలకు ఉండదు. కేవలం ఉద్దేశపూర్వకంగా చేసిన భారీ మోసాలను (Fraud) నిరూపిస్తే తప్ప, సాధారణ క్లెయిమ్‌లను కంపెనీలు ఆపలేవు.
కొత్త పాలసీ కొంటే మళ్లీ మొదటికే.. సున్నా నుంచి కౌంట్‌డౌన్!
చాలామంది ఏజెంట్లు తక్కువ ప్రీమియంతో కొత్త పాలసీని సిఫార్సు చేస్తూ, పాత పాలసీని పూర్తిగా రద్దు చేయిస్తుంటారు. ఇలా పాత పాలసీని రద్దు చేసి కొత్తది కొనుగోలు చేసిన మరుక్షణమే మీ ఐదేళ్ల మోరటోరియం రక్షణ పూర్తిగా రద్దయిపోతుంది. కొత్త పాలసీకి మళ్లీ మొదటి రోజు నుంచి సరికొత్తగా 5 ఏళ్ల కౌంట్‌డౌన్ ప్రారంభమవుతుంది. ఆ సమయంలో బీపీ, షుగర్ వంటి వ్యాధుల చరిత్రను సరిగ్గా వెల్లడించలేదని ఆరోపిస్తూ ఆసుపత్రి బిల్లుల క్లెయిమ్‌లను కంపెనీలు సులభంగా తిరస్కరించే అవకాశం ఏర్పడుతుంది. అంటే, కొద్దిపాటి ప్రీమియం ఆదా కోసం ఐదేళ్లుగా నిలబెట్టుకున్న భద్రతను స్వచ్ఛందంగా పోగొట్టుకున్నట్లే అవుతుంది.
‘పోర్టింగ్’ లేదా ‘మైగ్రేషన్’ మాత్రమే సురక్షిత మార్గం
ఒకవేళ మీరు వేరే కంపెనీకి మారాలనుకున్నా లేదా అదే కంపెనీలో మెరుగైన పాలసీకి మారాలనుకున్నా, ఎట్టిపరిస్థితుల్లోనూ పాత పాలసీని నేరుగా రద్దు చేయరాదు.
పోర్టింగ్ : ప్రస్తుత కంపెనీని మార్చి వేరే ఇన్సూరెన్స్ సంస్థకు మారడం.
మైగ్రేషన్ : అదే కంపెనీలోని ఇతర ప్లాన్లలోకి మారడం.
ఈ రెండు మార్గాల ద్వారా మారినప్పుడు మాత్రమే మీ పాత పాలసీలో సంపాదించిన ఐదేళ్ల మోరటోరియం కాలం, వెయిటింగ్ పీరియడ్ ప్రయోజనాలు సరికొత్త పాలసీకి యథాతథంగా బదిలీ అవుతాయి.
సమ్ ఇన్‌ష్యూర్డ్ పెంచితే గుర్తుంచుకోవాల్సిన అంశాలు
ఒకవేళ మీరు పాలసీ మార్పిడి సమయంలో బీమా రక్షణ మొత్తాన్ని రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచినట్లయితే, పాత రూ. 5 లక్షలకు మాత్రమే ఐదేళ్ల మినహాయింపు రక్షణ వర్తిస్తుంది. అదనంగా పెంచిన మరో రూ. 5 లక్షల మొత్తంపై తిరిగి కొత్తగా 5 ఏళ్ల మోరటోరియం నియమాలు ప్రారంభమవుతాయి. అందువల్ల కేవలం తక్కువ ప్రీమియం చూసి కాకుండా రూమ్ రెంట్ పరిమితులు, కో-పే నిబంధనలు, పాలసీ నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మార్పు చేయాలని, ఏజెంట్ల మాటలకు తొందరపడవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.