ప్రశాంతతతోనే నిద్రకు ఉపక్రమించాలి
సూర్య ప్రత్యేక డెస్క్: నిద్రపోయే ముందు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడుతుందని బ్రహ్మకుమారీస్ మీడియా వింగ్ వైస్ చైర్‌పర్సన్ బీకే సరళ పేర్కొన్నారు. రోజంతా జరిగిన సంఘటనలు, గత జ్ఞాపకాలు లేదా భవిష్యత్తు గురించిన ఆందోళనలతో నిద్రలోకి వెళ్లే బదులు, రాత్రి పడుకునే ముందు మనసులోని ఆలోచనలను తొలగించుకోవడం ఎంతో అవసరమని ఆమె విశ్లేషించారు. పగటిపూట ఎదురైన చేదు అనుభవాలు, భావోద్వేగాలను వదిలిపెట్టి సానుకూల ధోరణితో విశ్రాంతి తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుందని తెలిపారు.
రాజయోగ ధ్యానం ప్రకారం నిద్ర అనేది కేవలం శారీరక విశ్రాంతి మాత్రమే కాదని, ఆత్మ తన బాధ్యతలు మరియు పాత్రల నుంచి తాత్కాలికంగా విడివడి ప్రశాంత స్థితికి చేరుకునే పవిత్ర సమయమని సూచించారు. నిద్రపోవడానికి ముందు కొన్ని నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని, ప్రతి ఒక్కరిపట్ల మంచి భావాలతో క్షమాగుణాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లను విడిచిపెట్టి, ఈశ్వర స్మరణతో నిద్రకు ఉపక్రమించడం ద్వారా ఉదయం ఎంతో ఉత్సాహంగా, ప్రశాంతంగా మేల్కొనే అవకాశం ఉంటుందని ఈ కథనం ద్వారా వివరించారు.