ఐదు ఐరోపా దేశాల యుద్ధ వాహనాల కొనుగోలు ఒప్పందం
సూర్య బిజినెస్ డెస్క్: ఐదు ఐరోపా దేశాల నుంచి అందిన సైనిక యుద్ధ వాహనాల ఉమ్మడి కొనుగోలు ఆర్డర్ విలువ మొత్తం 6 బిలియన్ డాలర్లుగా ఉందని బ్రిటన్ రక్షణ రంగ సంస్థ బీఏఈ సిస్టమ్స్ శుక్రవారం వెల్లడించింది. ఫిన్‌లాండ్, స్వీడన్, నార్వే, లిథువేనియా, నెదర్లాండ్స్ దేశాలు కలిసి 430కి పైగా సీవీ90 యుద్ధ వాహనాలను కొనుగోలు చేయనున్నట్లు గురువారం ప్రకటించిన నేపథ్యంలో సంస్థ ఈ వివరాలను స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి దండయాత్ర తర్వాత నాటో సభ్యదేశాలు రక్షణ వ్యయాన్ని గణనీయంగా పెంచుతుండగా, ఖర్చులను నియంత్రించడంతో పాటు సైనిక సన్నద్ధతలో సమన్వయం కోసం ఉమ్మడి కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నాయి.
సీవీ9035 ఎంకే4 నార్డిక్ ఎడిషన్‌కు సంబంధించిన ఈ ఒప్పందం ఐదు దేశాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చిన తొలి ఉమ్మడి ఒప్పందంగా బీఏఈ సిస్టమ్స్ అభివర్ణించింది. ఈ వాహనాలను బీఏఈ సిస్టమ్స్‌కు చెందిన స్వీడన్ విభాగం బీఏఈ సిస్టమ్స్ హాగ్లండ్స్ ఉత్పత్తి చేస్తోంది. ఈ ఒప్పందానికి సంబంధించిన సంతకాల కార్యక్రమం శుక్రవారం స్టాక్‌హోమ్‌లో జరగనుండగా, స్వీడన్ ఈ కొనుగోలు ప్రక్రియలో ప్రధాన భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
ఈ ఒప్పందంలో భాగంగా ఫిన్‌లాండ్ సుమారు 2.8 బిలియన్ యూరోలతో 160 సీవీ90 వాహనాలను కొనుగోలు చేయనుండగా, అదనంగా మరో 100 వాహనాల కొనుగోలుకు అవకాశం కల్పించారు. విడిభాగాలు, నిర్వహణ కిట్లు, పరీక్ష పరికరాలు, శిక్షణ, లైసెన్సులు కూడా ఈ కాంట్రాక్టు పరిధిలోకి వస్తాయి. ఫిన్‌లాండ్ కొనుగోలు వాటాలో కొంత భాగాన్ని యూరోపియన్ యూనియన్ సేఫ్ రక్షణ నిధి రుణాల ద్వారా సమకూరుస్తుండగా, 30 శాతానికి పైగా విలువైన ఉప కాంట్రాక్టులను పదికి పైగా ఫిన్నిష్ సంస్థలకు అప్పగించే లక్ష్యంతో బీఏఈ సిస్టమ్స్ పనిచేస్తోంది.
గతంలో 2025లో ఐదు దేశాలతో పాటు ఎస్టోనియా కూడా ఉమ్మడి కొనుగోలుకు ఉద్దేశపత్రంపై సంతకం చేసినప్పటికీ, ఆ తర్వాత ఎస్టోనియా ఈ ప్రక్రియ నుంచి వైదొలిగింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐరోపా రక్షణ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఈ భారీ ఆర్డర్ కీలక మైలురాయిగా నిలుస్తోంది.