యువత, మహిళలకు రుణ సదుపాయాలు.. 27 మందికి రూ.1.09 కోట్ల రుణాలు
పరిశ్రమల మార్గదర్శక కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
యువత, మహిళలకు రుణ సదుపాయాలు.. 27 మందికి రూ.1.09 కోట్ల రుణాలు
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం, మేజర్ న్యూస్: జిల్లాలో కొత్తగా పరిశ్రమలు, స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయాలనుకునే యువత, మహిళలు, ఔత్సాహికులకు ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా రుణ సదుపాయాలు కల్పిస్తోందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన సమాచారం, మార్గదర్శకత్వం అందించేందుకు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న పరిశ్రమల మార్గదర్శక కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.సోమవారం కలెక్టరేట్‌లో డీఆర్‌డీఏ, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశ్రమల మార్గదర్శక కేంద్రంలో కలెక్టర్ పాల్గొని ఔత్సాహికులకు రుణ మంజూరు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్త్రీనిధి, ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తుల అభివృద్ధి పథకం (పీఎంఎఫ్‌ఎంఈ), ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) తదితర పథకాల ద్వారా అర్హులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు.పథకాల ఎంపిక, రుణ దరఖాస్తు విధానం, అవసరమైన అనుమతులు, ఆహార భద్రతా లైసెన్సులు తదితర అంశాలపై ఒకే చోట మార్గదర్శకత్వం అందించడమే కేంద్రం లక్ష్యమన్నారు. ఇప్పటివరకు ఈ కేంద్రం ద్వారా ఆహార లైసెన్సులకు 50 మందికి, ప్రధానమంత్రి ఉద్యమి ఆధార్ ద్వారా 145 మందికి రుణ సదుపాయం కల్పించినట్లు తెలిపారు.సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 27 మంది ఔత్సాహికులకు రూ.1.09 కోట్ల రుణాలు మంజూరు చేశారు. ఇందులో స్త్రీనిధి ద్వారా 23 మందికి ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున, పీఎంఎఫ్‌ఎంఈ పథకం ద్వారా నలుగురికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రుణాలు మంజూరయ్యాయి. రుణాలను సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా వ్యాపారాలను అభివృద్ధి చేసి, మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.జిల్లాలో పరిశ్రమలు, స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయాలనుకునే వారు ప్రతి సోమవారం జరిగే పరిశ్రమల మార్గదర్శక కేంద్రాన్ని వినియోగించుకోవాలని ఆమె కోరారు.కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఎం.ఎస్.ఎస్. వేణుగోపాల్, పరిశ్రమల శాఖ అధికారి మంగపతి, డీపీఎం ఎస్. కుసుమకుమారి, స్త్రీనిధి ఏజీఎం ఆర్. రమణమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీనివాస్ భీమవరం