యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్
నెల్లిమర్ల, సెప్టెంబర్ 30;
నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధి జరజాపుపేట లో బుధవారం 'సద్భావన' సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. గంజాయి రవాణా, విక్రయాలు లేదా కలిగి ఉండటం చట్టరీత్యా తీవ్రమైన నేరమని, దీనికి 20 ఏళ్లకు పైగా జైలు శిక్ష లేదా మరణశిక్ష కూడా పడే అవకాశం ఉందని ఎస్పీ హెచ్చరించారు. మైనర్ బాలికలను వేధింపులకు గురిచేసి పోక్సో కేసుల్లో చిక్కుకోవద్దని, యువత ముందుగా చదువుపై దృష్టి పెట్టి ప్రయోజకులు కావాలని సూచించారు. "అమ్మ మనకు జన్మనిస్తే, హెల్మెట్ పునర్జన్మ ఇస్తుంది" అని పేర్కొంటూ... ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, అతివేగం, మైనర్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని కోరారు. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రజలు ఎలాంటి కక్షలకు పోకుండా పోలీసు శాఖకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎస్. రాఘవులు, సీఐలు ఎన్. శ్రీనివాసరావు, ఏవీ లీలారావు, నెల్లిమర్ల ఎస్సై గోపాలరావుతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.