యూనియన్ బ్యాంక్ సహకారంతో పోలీసులకు 24 భారీ బారికేడ్లు
శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణకు దోహదం
నెల్లూరు, అర్బన్, క్రైమ్ , మేజర్ న్యూస్ : నెల్లూరు నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, పండుగలు, మతపరమైన ఉత్సవాల సందర్భంగా పటిష్టమైన బందోబస్తు నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే దిశగా జిల్లా పోలీసు శాఖ మరో ముందడుగు వేసింది. యూనియన్ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధుల సహకారంతో నెల్లూరు టౌన్ సబ్ డివిజన్ పోలీసులకు 24 భారీ బారికేడ్లను అందజేశారు.జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని శుక్రవారం నెల్లూరు టౌన్ ఏఎస్పీ, దీక్ష సమక్షంలో నిర్వహించారు.నగరంలో ప్రధాన పండుగలు, మతపరమైన కార్యక్రమాలు, భారీ జనసమ్మర్థం ఉండే వేడుకలు, ప్రముఖుల పర్యటనలు తదితర సందర్భాల్లో పోలీసు బందోబస్తును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ బారికేడ్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.జనసమ్మర్థాన్ని క్రమబద్ధీకరించడం, వాహనాల రాకపోకలను నియంత్రించడం, ట్రాఫిక్‌ను సక్రమంగా మళ్లించడం, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేయడం వంటి విధుల్లో వీటిని వినియోగించనున్నారు.బారికేడ్ల అందుబాటుతో పోలీసు సిబ్బందికి విధుల నిర్వహణ మరింత సులభతరం కావడంతో పాటు ప్రజలకు మెరుగైన భద్రత కల్పించేందుకు అవకాశం కలుగుతుంది.ప్రజా భద్రతకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో బ్యాంకులు, వాణిజ్య సంస్థలు, ఇతర సంస్థలు సామాజిక బాధ్యతలో భాగంగా సహకరించడం అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.వివిధ సంస్థల భాగస్వామ్యంతో పోలీసు సేవలను మరింత బలోపేతం చేస్తూ, ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు జిల్లా పోలీసు శాఖ కృషి చేస్తోంది.ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ డి. శ్రీనివాస్, రీజినల్ అస్యూరెన్స్ హెడ్ రాఘవ రెడ్డి, ఈబీసీ హెడ్ శివశంకర్, ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్, సౌత్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కృష్ణారెడ్డి, ఇతర పోలీసు అధికారులు, యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు
.