విజయనగరంలో పోలింగ్ తేదీ మార్చాలని అభ్యర్థన.... * ఎన్నికల కమిషనర్ కులేఖ రాసిన యంత్రాంగం
విజయనగరం, సూర్య : అక్టోబర్ 27 న శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవం జరగనున్న నేపధ్యంలో విజయనగరం కార్పొరేషన్లలో పోలింగ్, దానికి అనుగుణంగా కౌంటింగ్ తేదీలను మార్చాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ తేదీని అక్టోబర్ 29 కి మారిస్తే అనుకూలంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి అన్నారు.
నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్, పోలింగ్, స్ట్రాంగ్ రూమ్ ల ఏర్పాటు, ఓట్ల లెక్కింపు ప్రక్రియలకు అవసరమైన సిబ్బంది, సామగ్రి, ఇతర ఏర్పాట్లను ముందస్తుగా సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సున్నిత, అతి సున్నిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, తగిన చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. బుధవారం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, ప్రతిఒక్కరూ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు సహకరించాలని కోరారు. శతశాతం ఓటింగ్ జరిగేందుకు కృషి చేస్తున్నామని, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
రిపోర్టర్ : డేవిడ్ రాజు, విజయనగరం.