విద్యతోనే పేదరికానికి శాశ్వత విముక్తి ప్రతి బిడ్డను చదివించడమే మౌలానా ఆజాద్‌కు నిజమైన నివాళి
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : డబ్బు, ఆస్తులు శాశ్వతం కాకపోవచ్చని, కానీ విద్యతో సంపాదించిన జ్ఞానాన్ని ఎవరూ దూరం చేయలేరని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతి సందర్భంగా బుధవారం నెల్లూరులోని ఆజాద్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్రం, జాతీయ సమైక్యత కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఆజాద్ అని కొనియాడారు. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగానికి బలమైన పునాదులు వేశారని, ఆయన సేవలకు గుర్తింపుగా జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. దేశ విభజనను వ్యతిరేకించి, అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి ఉండటమే దేశానికి బలమని చాటిచెప్పిన ఆజాద్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల కుటుంబాలు పిల్లల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. తాత్కాలిక ఆదాయం కోసం చిన్న వయసులోనే చదువు మాన్పించి పనులకు పంపవద్దన్నారు. ప్రతి బిడ్డలో ప్రతిభ ఉంటుందని, సరైన ప్రోత్సాహం అందిస్తే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, ఇంజనీర్లుగా, శాస్త్రవేత్తలుగా ఎదిగి కుటుంబానికి, దేశానికి సేవ చేయగలరని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తోందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో గుణాత్మక మార్పులు తీసుకొస్తున్నారని, మంత్రి పొంగూరు నారాయణ చొరవతో నెల్లూరులో మున్సిపల్ పాఠశాలల భవనాలు, మౌలిక వసతులు మెరుగుపడుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.