విద్యార్థుల్లో ఆవిష్కరణ ఆలోచనలు పెంపొందించడమే డైస్ లక్ష్యం విజ్ఞానంతో భవిష్యత్ సాంకేతికత వైపు - విద్యార్థుల అడుగులు పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సురేష్ బాబు..
విద్యార్థుల్లో ఆవిష్కరణ ఆలోచనలు
పెంపొందించడమే డైస్ లక్ష్యం
విజ్ఞానంతో భవిష్యత్ సాంకేతికత వైపు - విద్యార్థుల అడుగులు
పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సురేష్ బాబు..
వల్లూరు మేజర్ న్యూస్
విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలపై ఆసక్తి, సమస్యల పరిష్కార నైపుణ్యాలు, వ్యవస్థాపకత పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డెవలపింగ్ ఇన్నోవేషన్ కల్చర్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (డైస్) కార్యక్రమంలో భాగంగా గంగాయపల్లి పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు కడపలోని కెఎస్ఆర్‌ఎం ఇంజనీరింగ్ కళాశాలను విజ్ఞాన సందర్శన చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ సందర్శనలో విద్యార్థులు కళాశాలలోని ఆవిష్కరణల కేంద్రం, ఆధునిక ప్రయోగశాలలు, సాంకేతిక వసతులు, ఆవిష్కరణల అభివృద్ధి వ్యవస్థను పరిశీలించారు. భవిష్యత్ సాంకేతికతలు, నూతన ఆలోచనలు, సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు, నూతన సంస్థల స్థాపనకు సంబంధించిన అంశాలపై అధ్యాపకులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. డైస్ ద్వారా విద్యార్థులు ఒక సమస్యను గుర్తించి, దానికి కొత్త పరిష్కారాన్ని ఆలోచించి, ఆ ఆలోచనను ప్రాజెక్టు లేదా ఉపయోగకరమైన వస్తువుగా రూపొందించే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు. విద్యార్థులు రూపొందించే వినూత్న ఆలోచనలకు అవసరమైన మార్గదర్శకత్వం, సాంకేతిక సహకారం, ప్రోత్సాహం అందిస్తూ వాటిని ఆచరణలోకి తీసుకురావడానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా వారు వివరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సురేష్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో డైస్ కార్యక్రమానికి 198 పాఠశాలలు ఎంపిక కాగా, కడప జిల్లాలో 15 పాఠశాలలకు అవకాశం లభించింది. అందులో వల్లూరు మండలంలోని గంగాయపల్లి పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని తెలిపారు. విద్యార్థుల ఆలోచనలకు ఆచరణ రూపం కల్పించడమే డైస్ ప్రధాన ఉద్దేశ్యం అని. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనా దృక్పథం, ఆవిష్కరణలపై ఆసక్తి, వ్యవస్థాపక ఆలోచనా విధానాన్ని పెంపొందించాలని అన్నారు. విద్యార్థి ఒక మంచి ఆలోచనతో ముందుకు వస్తే దానిని ప్రాజెక్టుగా రూపొందించి, సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మార్గదర్శకత్వం, సాంకేతిక సహకారం, ప్రోత్సాహం అందించడమే డైస్ ప్రత్యేకత. ఇలాంటి విజ్ఞాన సందర్శనల ద్వారా విద్యార్థులను ఉన్నత సాంకేతిక విద్య, పరిశోధన, ఆవిష్కరణల వైపు ప్రోత్సహిస్తూ, పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్‌ను విద్య, విజ్ఞానం, ఆవిష్కరణలలో ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైస్ ఇన్‌చార్జి ఉపాధ్యాయులు డబ్ల్యూ. డేనియల్, మురళీమోహన్ ఆచారి ఆధ్వర్యంలో విద్యార్థులు పాల్గొన్నారు..