కాలుష్యంపై నిర్లక్ష్యం వీడని .. 95 పరిశ్రమలకు షోకాజ్ నోటీసులు
అమరావతి, సూర్య ప్రతినిధి : పరవాడ ఫార్మాసిటీలో నల్లటి నీరు, దుర్వాసన వస్తున్నాయంటూ వచ్చిన ఫిర్యాదులపై ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు స్పందించారు. ఫార్మాసిటీలో క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి వ్యర్థజలాల నమూనాలను సేకరించారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.
పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థజలాల నిర్వహణ, కాలువల్లోకి వాటి విడుదలపై పీసీబీ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థజలాలను కాలువల్లోకి విడుదల చేయొద్దని పరిశ్రమలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఫార్మాసిటీలోని 95 పరిశ్రమలకు పీసీబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రమాదకర వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతుల్లోనే నిర్వహించాలని అధికారులు సూచించారు. పరిశ్రమల్లో వ్యర్థజలాలపై ఆన్‌లైన్ పర్యవేక్షణ వ్యవస్థను తప్పనిసరి చేయాలని స్పష్టం చేశారు.
వ్యర్థాల నిర్వహణ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు డిజిటలీకరణ చేపట్టాలని పీసీబీ సూచించింది. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
క్షేత్రస్థాయి పరిశీలన, నమూనాల సేకరణ, పరిశ్రమలకు జారీ చేసిన నోటీసులు, తీసుకోవాల్సిన తదుపరి చర్యలకు సంబంధించిన వివరాలతో పీసీబీ అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయానికి నివేదిక సమర్పించారు. నమూనాల పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.