వెలిగొండ పునరావాస పనులు వేగవంతం చేయాలి
ఇడుపూరు–1, 2, వేములకోట లేఔట్లను పరిశీలించిన కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం మేజర్ న్యూస్
వెలిగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీల్లో మిగిలి ఉన్న పనులను అత్యంత వేగంగా పూర్తి చేసి నిర్వాసితులకు అవసరమైన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు. మంగళవారం జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులతో కలిసి వెలిగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీలైన ఇడుపూరు–1, ఇడుపూరు–2, వేములకోట లేఔట్లను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన, ఇంకా పూర్తికావాల్సిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కాలనీల్లో నిర్వాసితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పించాలని సూచించారు.లేఔట్లలో మిగిలి ఉన్న పనులను ప్రాధాన్యత క్రమంలో గుర్తించి, వాటిని ఆలస్యం చేయకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నాణ్యతా ప్రమాణాలను పాటించాలని స్పష్టం చేశారు.కార్యక్రమంలో వెలిగొండ ప్రాజెక్టు అధికారులు, సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.