వెల్దుర్తి అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తా: సర్పంచ్ అభ్యర్థి టి.వి. రమేష్
వెల్దుర్తి, సూర్య ప్రతినిధి మేజర్ న్యూస్:"తండ్రి ఆశయ సాధనే ధ్యేయంగా, వెల్దుర్తి గ్రామ పంచాయతీ సర్వాంగీణ అభివృద్ధికే నా జీవితం అంకితం" అని గ్రామ సర్పంచ్ అభ్యర్థి టి.వి. రమేష్ (తిరువీధి వెంకట రమేష్) తెలిపారు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన స్థానిక ప్రజలను కలిసి ఆశీస్సులు కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత 18 ఏళ్లుగా గ్రామంలో నిరంతరం ప్రజలతో అనుబంధం కలిగి ఉంటూ, ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతున్నానని పేర్కొన్నారు. తన తండ్రి గారు చూపిన ధర్మబద్ధమైన ప్రజాసేవా మార్గంలో నడుస్తూ, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు."పదవుల కోసం కాకుండా, గ్రామ ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉండేందుకే సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. పంచాయతీ పరిధిలో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, డ్రైనేజీ, రహదారుల నిర్మాణంతో పాటు ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తాను. రాబోయే ఎన్నికల్లో గ్రామీణులు నాకు ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే, మీ నమ్మకాన్ని నిలబెట్టుకొని నిబద్ధతతో పనిచేస్తాను" అని రమేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, యువకులు, మహిళలు మరియు రమేష్ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సూర్య ప్రతినిధి షేక్ దస్తు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం