ఉరివేసుకొని జ్యూట్ మిల్లు ఉద్యోగిని ఆత్మహత్య
నెల్లిమర్ల, సెప్టెంబర్ 30;,నగర పంచాయతీ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జ్యూట్ మిల్లులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
బుధవారం ఎస్సై జి. గోపాలరావు అందించిన వివరాల ప్రకారం... స్థానిక గాంధీనగర్ కాలనీకి చెందిన నడిపిల్లి గీత (42) మధ్యాహ్నం సమయంలో తన ఇంట్లో ఉరివేసుకుని మృతిచెందింది. గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు ఆమెను వెంటనే స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించినప్పటికీ, అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు ధృవీకరించారు.
మృతురాలు గీత సుమారు 20 ఏళ్లుగా జ్యూట్ మిల్లులో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె భర్త శంకర్ కార్పెంటర్‌గా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె (8వ తరగతి), ఒక కుమారుడు (4వ తరగతి) ఉన్నారు. తల్లి అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ ఆత్మహత్యకు గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న ఎస్సై గోపాలరావు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.