ఉద్యాన రంగంలో విప్లవాత్మక మార్పులు: పరిటాల సునీత
అనంతపురం బ్యూరో : అనంతపురం జిల్లా ఉద్యాన రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. గంగులకుంటలో ఉద్యాన రైతులకు రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులతో కలిసి చీనీ తోటలను పరిశీలించిన ఆమె, నకిలీ విత్తనాలు, నాణ్యత లేని మొక్కల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విత్తనాలు, మొక్కలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా అధికారిక రశీదు తీసుకోవాలని తెలిపారు.
రాయలసీమలో ఉద్యాన రంగ అభివృద్ధికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఉద్యాన పంటలను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానం చేయడమే లక్ష్యమన్నారు.
గంగులకుంటకు రూ.1.20 కోట్లతో సీసీ రోడ్డు
పల్లె పండుగ–3.0లో భాగంగా జాతీయ రహదారి నుంచి గంగులకుంట వరకు రూ.1.20 కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే పరిటాల సునీత భూమిపూజ చేశారు. వచ్చే ఏడాది గొందిరెడ్డిపల్లి నుంచి గంగులకుంట చెరువుకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాప్తాడు మండలంలో పల్లె పండుగ కింద రూ.5.46 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో సాగు, తాగునీరు, రహదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.