తుపాను అనంతర పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
విజయవాడ, మేజర్ న్యూస్: అర్నబ్ తుపాను ప్రభావం తగ్గిన నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ తుపాను అనంతర పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. గురువారం క్షేత్రస్థాయి అధికారులతో సమీక్షిస్తూ, నగర, గ్రామీణ ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, బురదను తొలగించాలని, నీరు నిలిచిన ప్రాంతాలను శుభ్రం చేయాలని సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ, జిల్లా పంచాయతీ, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేస్తూ అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, దోమల నివారణకు ఫాగింగ్ నిర్వహించడం, తాగునీటి వనరులను పరిరక్షించడం వంటి చర్యలు చేపట్టాలని తెలిపారు. వైద్య సిబ్బంది, అవసరమైన మందులను అందుబాటులో ఉంచి, ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత, సురక్షిత తాగునీటిపై అవగాహన కల్పించాలన్నారు. శుభ్రపరిచిన నీటి ట్యాంకులు, వినియోగించిన బ్లీచింగ్ పౌడర్, తొలగించిన ఘన వ్యర్థాలు, ఫాగింగ్ నిర్వహించిన ప్రాంతాల వివరాలతో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. తుపాను అనంతరం ప్రజారోగ్యానికి ముప్పు కలగకుండా అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పనులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.