త్రిశూల వ్యూహంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు
విజయవాడ క్రైం, మేజర్ న్యూస్ : శాంతిభద్రతల పరిరక్షణ, సైబర్ నేరాల నియంత్రణ, రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు ఎన్‌టీఆర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ‘త్రిశూల వ్యూహం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, కె.జి.వి. సరిత, పశ్చిమ డీసీపీ రామకృష్ణ పర్యవేక్షణలో ఏసీపీ వి.ఎస్.ఎన్. వర్మ, ఇన్‌స్పెక్టర్లు పి. జగదీష్, మురళీకృష్ణ, సీఐ ఉమామహేశ్వరరావు తమ సిబ్బందితో కలిసి కృష్ణలంకలోని ఏపీఎస్‌ఆర్‌ఎం పాఠశాల, భవానీపురంలోని సిద్ధార్థనగర్‌లో కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు, స్థానికులకు చిన్నచిన్న వీడియోల ద్వారా సైబర్ నేరాలు, డిజిటల్ భద్రత, రహదారి ప్రమాదాల నివారణ, మహిళలు, పిల్లల రక్షణ, గంజాయి, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. అపరిచితుల ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకులు, లాటరీ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. మహిళలు, బాలికలకు ఆపద ఎదురైతే 112 అత్యవసర సహాయ నంబరును వినియోగించుకోవాలని తెలిపారు. నేరరహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.