తిరుపతి టిల్ హెల్త్ కేర్ ప్రమాదం: 5కు పెరిగిన మృతుల సంఖ్య.. బాధితులకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కేసు నమోదు
సత్యవేడు, సూర్య ప్రతినిధి :తిరుపతి జిల్లా సత్యవేడు మండలం శ్రీసిటీలోని టిల్ హెల్త్ కేర్ (TIL Healthcare) పరిశ్రమలో చోటుచేసుకున్న ఘోర బాయిలర్ పేలుడు ప్రమాదంలో మృతుల సంఖ్య 5కు చేరింది. ఈ దుర్ఘటనపై ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సహాయం (ఎక్స్‌గ్రేషియా) అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యం వహించినందుకుగాను ఫ్యాక్టరీ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాయిలర్ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తం ఘోర ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా బాధ్యులైన వారిపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.