జర్నలిస్టుల హక్కుల కోసం సమరశంఖం- నంద్యాల జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్
-ఈ నెల 12న ‘చలో కలెక్టరేట్’.. APWJF జిల్లా కమిటీ పిలుపు
నంద్యాల అర్బన్:
సమాజ శ్రేయస్సు కోసం, ప్రజలకు- ప్రభుత్వానికి మధ్య వారధిలా రాత్రింబవళ్లు శ్రమిస్తున్న విలేకరుల న్యాయమైన హక్కుల సాధనకు ఏపీడబ్ల్యూజేఎఫ్ (APWJF) పోరాట బాట పట్టింది. జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాల కేటాయింపు, కరోనా కాలంలో రద్దయిన రైల్వే పాసుల పునరుద్ధరణ, విలేకరులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు రక్షణ చట్టం, జర్నలిస్టులకు సంక్షేమ నిధి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12వ తేదీన నంద్యాల కలెక్టరేట్ ముట్టడికి సమరశంఖం పూరించింది. శనివారం నంద్యాలలో నిర్వహించిన APWJF జిల్లా కార్యవర్గ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మద్దయ్య యాదవ్ మాట్లాడారు. ప్రజాసమస్యలపై కలంతో పోరాడే జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు పూర్తిగా విస్మరిస్తున్నాయని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి వార్తలు రాస్తున్న విలేకరులకు కనీస భద్రత కరువైందని, వారిపై దాడులు నిత్యకృత్యంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త చట్టాలు తీసుకురాకపోయినా, ప్రస్తుతం ఉన్న చట్టాలనైనా కఠినంగా అమలు చేసి విలేకరులకు రక్షణ కల్పించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నిరుపేద జర్నలిస్టులకు తక్షణమే ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని, గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే కన్సెస్ పాసులను వెంటనే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ న్యాయమైన కోర్కె ల సాధన కోసం జిల్లాలోని ప్రతీ జర్నలిస్ట్ ఒక్కటై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 12న నిర్వహించే ‘చలో కలెక్టరేట్’ కార్యక్రమానికి జిల్లాలోని విలేకరులంతా పెద్ద ఎత్తున తరలివచ్చి, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి మన నిరసన గళాన్ని బలంగా వినిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో APWJF రాష్ట్ర కమిటీ సభ్యుడు మౌలాలి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం గిరిబాబు సాగర్, జిల్లా ఉపాధ్యక్షులు నిజాముద్దీన్, నరసింహారెడ్డి , సుబ్బరాయుడు,నాగన్న, ట్రెజరర్ మస్తాన్, ప్రచార కార్యదర్శి సి.హెచ్ .రామారావు, సహాయ కార్యదర్శులు రామచంద్రారెడ్డి, రంగస్వామి, చంద్రబాబు, వేణుగోపాల్, ఏపీ బీజేఏ జిల్లా ప్రధాన కార్యదర్శి జవహర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం. హుస్సేన్ భాష జిల్లా సహాయ కార్యదర్శి ఏ. అణు పాల్, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు జి.వి. సుబ్రహ్మణ్యం, బి. నరసింహులు, పి రాధిక, జి. సుజాత తదితరులు పాల్గొన్నారు. జిల్లా కమిటీ ప్రతినిధులు, ఇతర ప్రధాన నాయకులు పాల్గొన్నారు.