తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల నామినేషన్లు పూర్తి - వైసిపి నామినేషన్లపై సందిగ్ధత
గూడూరు, మేజర్‌న్యూస్ : గూడూరు నియోజకవర్గ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపిటిసి అభ్యర్ధుల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మొదటి రోజు గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల పరిధిలో నామినేషన్ల ప్రక్రియ హుషారుగా సాగింది. మొదటి రోజు మొత్తంలో తెలుగుదేశం అభ్యర్ధులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. గూడూరు మండలంలో 8 ప్రాదేశిక స్థానాలకు తెలుగుదేశం పార్టీ నుంచి 16 మంది అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక్కడ సంతదాసుపల్లి ప్రాదేశిక స్థానం నుంచి వైసిపి నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. కొద్ది సేపు నామినేషన్ కేంద్రం వద్ద ఉత్రిక్తత నెలకొంది. వైసిపి నియోజకవర్గ కన్వీనర్ గురవయ్య, లీగల్ టీం అధికారులతో చర్చించినా ఫలితం లేక పోయింది. అదే విధంగా చిల్లకూరు మండలంలో 13 ప్రాదేశిక స్థానలకు కడివేడు మినహా అన్ని స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్దులు నామినేషన్‌లు దాఖలు చేశారు. ఇక్కడా వైసిపి నుంచి నామినేషన్ దాఖలు ఏసే ప్రయత్నాలు విఫలం కావడం విశేషం. చిట్టమూరు మండలంలో 12 ప్రాదేశిక స్థానాలలో తెలుగుదేశం పార్టీ నుంచి 23 మంది అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేయగా వైసిపి నుంచి నామినేషన్లు దాఖలు చేయలేక పోయారు. కోట మండలంలో 16 ప్రాదేశిక స్థానాలకు తెలుగుదేశం నుంచి 5 స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. మరోపక్క వైసిపి నుంచి ఎవ్వరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. వాకాడు మండలంలో 11 మండల ప్రాదేశిక స్థానాలకు పది స్థానాల్లో తెలుగుదేశం నామినేషన్లు దాఖలు చేశారు. ఇక్కడా వైసిపి నుంచి ఎవ్వరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ పూర్తి ఆధిక్యం కనబరిచే పరిస్థితి నెలకొంది.