తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన సబ్ కలెక్టర్
మక్కువ, సూర్య : మండల కేంద్రం మక్కువ తహసీల్దార్ కార్యాలయాన్ని పార్వతీపురం సబ్ కలెక్టర్ సచిన్ అర్చిత్ రహార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని పలు కీలక రికార్డులను పరిశీలించి, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, అర్జీలను నిర్ణీత గడువులోగా విచారించి ప్రజలకు గుణాత్మకమైన సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని ఈవీఎంల భద్రతా గదిని (స్ట్రాంగ్ రూమ్) సబ్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన రక్షణ చర్యలు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ భాను ప్రసాద్ , రెవెన్యూ సిబ్బంది,ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : తిరుపతిరావు, మక్కువ, పార్వతీపురం మన్యం.