స్విమ్స్‌లో అధునాతన శస్త్రచికిత్స -60 ఏళ్ల మహిళకు ప్రాణాలు నిలిపిన వైద్యులు
ఓ మహిళకు స్విమ్స్ లో అధునాతన శాస్త్ర చికిత్స అందించి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. కడప జిల్లా సుండుపల్లికి చెందిన 60 ఏళ్ల మహిళ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అత్యంత విషమ పరిస్థితిలో తిరుపతిలోని స్విమ్స్ కు తరలివచ్చారు. తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమెకు పరీక్షలు నిర్వహించగా ఈవెంట్రేషన్‌తో కూడిన ట్రామాటిక్ లెఫ్ట్ డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.ప్రమాదం కారణంగా డయాఫ్రమ్ దెబ్బతిని ఉదర అవయవాలు ఛాతీలోకి చేరి ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింది. దీనికి తోడు వెన్నుపూస గాయాలు, న్యూమోనియా, వెంటిలేటర్ అవసరమయ్యే పరిస్థితి ఉండటంతో కేసు మరింత సవాలుగా మారింది.ఈ నేపథ్యంలో సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ బృందం మల్టీడిసిప్లినరీ బృందంతో చర్చించి ఆగస్టు 15న ఈవెంట్రేషన్ ప్లికేషన్‌తో లాపరోస్కోపిక్ లెఫ్ట్ డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా రిపేర్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. పెద్ద కోత లేకుండా చిన్న రంధ్రాల ద్వారా కెమెరా సహాయంతో ఈ క్లిష్టమైన ఆపరేషన్ చేయడం విశేషం.ఆపరేషన్ అనంతరం రోగిని ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంచి పర్యవేక్షించారు. చికిత్స క్రమంలో గుండె సంబంధిత ఎస్ వి టీ సమస్య రావడంతో కార్డియాలజీ, సీజర్ రావడంతో న్యూరాలజీ నిపుణులు చికిత్స అందించారు.సర్జికల్ గ్యాస్ట్రో, క్రిటికల్ కేర్, కార్డియాలజీ, న్యూరాలజీ, రేడియాలజీ, బ్లడ్ బ్యాంక్, నర్సింగ్ విభాగాల సమన్వయంతో రోగి పూర్తిగా కోలుకుని సెప్టెంబర్ 30న డిశ్చార్జ్ అయ్యారు. ఆమె చికిత్సకు అయిన ఖర్చును సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించారు.ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు డా. గుడారు జగదీష్ మాట్లాడుతూ పేద రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే స్విమ్స్ లక్ష్యమని, ఈ విజయం వైద్య బృందాల సమష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆపరేషన్ లో సర్జికల్ గ్యాస్ట్రో ప్రొఫెసర్ డా. సి. చంద్రమోలీశ్వరన్, విభాగాధిపతి డా. జి. శివరామకృష్ణ తదితర వైద్య బృందం పాల్గొన్నారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి