స్వచ్ఛత ప్రతి ఒక్కరి బాధ్యత
అనపర్తి మేజర్ న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్న ‘స్వచ్ఛ సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా అనపర్తి ప్రెస్‌క్లబ్ పరిసరాల్లో శుభ్రతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కాకినాడ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు రామ్‌కుమార్, కూటమి నాయకులు రోడ్లను శుభ్రపరిచారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని కోరారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.నెల రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వచ్ఛతా కార్యక్రమాలు నాయకులు పిలుపునిస్తేనే కాకుండా ప్రజలందరూ స్వచ్ఛందంగా ఆచరించినప్పుడే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు, అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, అనపర్తి టౌన్ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.