BREAKING
చెరువు కట్ట రహదారి అధ్వానం.. మరమ్మతులు ఎప్పుడు? జగ్గయ్యపేటలో త్వరలో ఎమర్జెన్సీ కేర్ క్లినిక్ ప్రారంభం! ఎమ్మెల్యే తాతయ్య చొరవతో 24/7 అత్యవసర వైద్య సేవలకు ముందడుగు అక్టోబర్ 25న ప్రారంభానికి సన్నాహాలు కలామ్ జీవితం ఆదర్శనీయం: వర్షపు నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ జాతీయ సరస్ మేళా-2026ను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాలీవుడ్‌లో మాయమవుతున్న పిల్లల సినిమాలు.. 'తారే జమీన్ పర్' అందించిన పరిశ్రమలో ఏమైంది? ఎన్నికల ప్రవర్తన నియామవాళి పాటించని ఉద్యోగిపై చర్యలు స్థానిక సంస్థల ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు జిల్లా పోలీసుల ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు రేపు మహబూబ్నగర్లో సాహిత్య సందడి ఓటీటీలోకి తేజ సజ్జా 'ది ట్రైటర్స్ తెలుగు'.. మొదటి మూడు ఎపిసోడ్ల స్ట్రీమింగ్ టైమ్, పూర్తి వివరాలు ఇవే! ఘనంగా బిగ్‌బాస్ బ్యూటీ ప్రేరణ సీమంతం వేడుక.. రష్మిక సాంగ్‌తో స్పెషల్ అట్రాక్షన్! ఓటీటీలోకి వచ్చిన తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ 'ఎన్న విలై'.. తెలుగులోనూ స్ట్రీమింగ్! పుంగనూరు మునిసిఫల్ ఛైర్ పర్సన్ రేసులో సులోచన 'క్రేజీ కల్యాణం' ఈవెంట్‌లో కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్.. వేదికపైనే తల్లిదండ్రులను హగ్ చేసుకుని ఎమోషనల్!

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు*

Select Suryaa Now
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు*

 

*స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు*

*కచ్చితంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు*

*నామినేషన్ల స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు వరకు నిబంధనల ప్రకారం నిర్వహణ*

*స్థానిక ఎన్నికల షెడ్యూల్, మార్గదర్శకాలను వెల్లడించిన జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి*

కర్నూలు, అక్టోబర్ 15: జిల్లాలో పట్టణ స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు.

గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక ఎన్నికల షెడ్యూల్, నామినేషన్ల స్వీకరణ, పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, అభ్యర్థుల వ్యయ పరిమితులు, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన అంశాలపై మార్గదర్శకాలను మీడియా సమావేశంలో వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ....కర్నూలు నగరపాలక సంస్థ, ఎమ్మిగనూరు, ఆదోని మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 14న నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. అక్టోబర్ 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారని వివరించారు. అక్టోబర్ 19న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 21న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించి, అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని తెలిపారు. అక్టోబర్ 28న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారని,  అవసరమైతే అక్టోబర్ 29న రీపోలింగ్ చేపడతారని పేర్కొన్నారు. అక్టోబర్ 30న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని వివరించారు.

*ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్*

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ 19న విడుదల కానుందని తెలిపారు. అక్టోబర్ 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమై, అక్టోబర్ 23న ముగుస్తుందని పేర్కొన్నారు. అక్టోబర్ 24న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 25న తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్లు, అక్టోబర్ 26న అప్పీళ్ల పరిష్కారం ఉంటుందని వివరించారు. అక్టోబర్ 27న నామినేషన్ల ఉపసంహరణతో పాటు తుది అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని, నవంబర్ 3న పోలింగ్, అవసరమైతే నవంబర్ 4న రీపోలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. నవంబర్ 5న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని వివరించారు.

*మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు*

గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందించినట్లు తెలిపారు. 
*మొదటి దశ:* నవంబర్ 13న నోటిఫికేషన్, నవంబర్ 15న ఆర్‌ఓ/ఈఓ నోటీసు, నవంబర్ 17 వరకు నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 18న పరిశీలన, నవంబర్ 19న అప్పీళ్లు, నవంబర్ 21న అప్పీళ్ల పరిష్కారం, ఉపసంహరణ, తుది జాబితా ప్రకటన ఉంటాయని తెలిపారు. నవంబర్ 26న పోలింగ్, అవసరమైతే నవంబర్ 27న రీపోలింగ్, ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారని వివరించారు.

*రెండో దశ:* నవంబర్ 16న నోటిఫికేషన్, నవంబర్ 18న నోటీసు, నవంబర్ 20 వరకు నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 21న పరిశీలన, నవంబర్ 22న అప్పీళ్లు, నవంబర్ 23న అప్పీళ్ల పరిష్కారం, నవంబర్ 24న ఉపసంహరణ, తుది జాబితా ప్రకటన ఉంటాయని పేర్కొన్నారు. నవంబర్ 29న పోలింగ్ నిర్వహించి, ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారని వివరించారు.

*మూడో దశ:*  నవంబర్ 19న నోటిఫికేషన్, నవంబర్ 21న నోటీసు, నవంబర్ 23 వరకు నామినేషన్ల స్వీకరణ, నవంబర్ 24న పరిశీలన,  నవంబర్ 25న అప్పీళ్లు, నవంబర్ 26న అప్పీళ్ల పరిష్కారం, నవంబర్ 27న ఉపసంహరణ, తుది అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటాయని వివరించారు. డిసెంబర్ 2న పోలింగ్, అవసరమైతే డిసెంబర్ 3న రీపోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

*ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలి*

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ సూచించారు. కుల, మత, ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని, వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ ఎన్నికల వాతావరణానికి భంగం కలిగించరాదని స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమాలు, లౌడ్‌స్పీకర్ల వినియోగానికి సంబంధిత అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని, రాత్రి 10 గంటల తర్వాత లౌడ్‌స్పీకర్ల వినియోగం చేయరాదని తెలిపారు. ప్రభుత్వ భవనాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారులు తదితర ప్రాంతాల్లో అనుమతి లేకుండా పోస్టర్లు, హోర్డింగ్‌లు, ప్రచార సామగ్రి ఏర్పాటు చేయరాదని తెలిపారు. ప్రైవేట్ ఆస్తులపై కూడా యజమానుల అనుమతి లేకుండా పోస్టర్లు అంటించడం, ప్రచార సామగ్రి ఏర్పాటు చేయడం నిషేధమని పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.  ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) పోర్టల్ ద్వారా అందుబాటులో ఉన్న సేవలను అభ్యర్థులు, ఓటర్లు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. పోర్టల్‌లో అందుబాటులో ఉన్న సదుపాయాల మేరకు ఆన్‌లైన్ నామినేషన్ల దాఖలు, ఓటరు స్లిప్పుల డౌన్‌లోడ్, పోలింగ్ కేంద్రాల వివరాలను తెలుసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు సంబంధించి అధికారిక మార్గదర్శకాలను అనుసరించాలని సూచించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిర్దేశించిన వ్యయ పరిమితులను కచ్చితంగా పాటించాలని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఖర్చుల వివరాలను నిబంధనల ప్రకారం నమోదు చేసి, అవసరమైన లెక్కలను నిర్వహించాలని సూచించారు. ఎన్నికల వ్యయ పర్యవేక్షణకు సంబంధించిన మార్గదర్శకాలను అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు, సమస్యలు ఉంటే 1800 425 4299 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయవచ్చని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనలకు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.

*సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు.. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు*

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ....స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు పోలీసు శాఖ తరఫున ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. గ్రామాల్లోని సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్న వ్యక్తులపై బైండ్ ఓవర్ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో జాయింట్ కార్డన్ సెర్చ్‌లు, ఫ్లయింగ్ స్క్వాడ్లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక గ్రామాలు, ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలతో పాటు ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్‌ను మోహరించి, నిరంతర నిఘా కొనసాగిస్తామన్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించేందుకు పోలీసు, రెవెన్యూ శాఖలతో సంయుక్త బృందాలు పనిచేస్తాయని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పట్టణ స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ  కోరారు.


*అక్రమ ఏకగ్రీవాలపై ఆర్‌డీఓ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ – జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్*

స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. నామినేషన్ ప్రక్రియ, ఎన్నికల నిబంధనలు, అవసరమైన ధ్రువపత్రాలు, డిక్లరేషన్ల సమర్పణపై పోటీ చేయనున్న అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు హెల్ప్‌డెస్క్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏకగ్రీవ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తామని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.  

మీడియా సమావేశంలో కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు, జిల్లా పరిషత్ సీఈవో సుధాకర్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్ పాల్గొన్నారు.