'స్థానిక' సందడి షురూ! పల్లెపోరుకు పార్టీలు సమాయత్తం
విజయనగరం ప్రతినిధి, సూర్య : ఏక్షణమైనా స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పట్నుంచే అప్రమత్తమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. అంగబలం, అర్థబలం ఉన్న గెలుపు గుర్రాలపై దృష్టి సారిస్తూనే, రాజకీయ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. గత స్థానిక ఎన్నికల్లో అప్పటి అధికార వైసీపీ చేతిలో చావుదెబ్బతిన్న, టీడీపీ ఇప్పుడు ఆపార్టీపై రెట్టింపు బదులు తీర్చుకోవాలని పట్టుదలతో ఉండగా, ఎలాగైనా ప్రస్తుత బలాన్ని నిలుపుకోవాలని వైసీపీ ఆరాటపడుతోంది. ఇక, ఈ ఎన్నికలను అవకాశంగా మలుచుకొని క్షేత్రస్థాయిలో ఉనికిని పెంచుకోవాలని జనసేన భావిస్తోంది. మూడు పార్టీల హోరాహోరీ మధ్య బీజేపీ ఎప్పట్లాగే ఆటలో అరటిపండుగా మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
2021లో పంచాయతీ పోరు ఫిబ్రవరిలో నాలుగు విడతల్లో జరగ్గా, మరుచటి నెలలో పట్టణ స్థానిక సంస్థలైన మున్సిపల్ కార్పోరేషన్, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఒకే విడతలో నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏప్రిల్లో పూర్తయ్యాయి. అన్ని ఎన్నికల్లో అప్పటి అధికార వైసీపీ నయనో భయానో తనకు ఎదురులేకుండా చేసుకుంది. సుమారు 80శాతం పంచాయతీల్లో పాగా వేసింది. విజయనగరం కార్పొరేషన్ సహా మూడు మున్సిపాలిటీలు, నెల్లిమర్ల నగర పంచాయతీని తన ఖాతాలో జమచేసుకుంది. 90శాతం ఎంపీటీసీలు, నూరుశాతం జెడ్పీటీసీలను కొల్లగొట్టి అన్ని ఎంపీపీ స్థానాలతోపాటు కీలకమైన జెడ్పీ పీఠాన్ని సునాయాసంగా కైవసం చేసుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయవిహారం చేస్తూ వచ్చిన టీడీపీ తొలిసారిగా ఘోర పరాజయాన్ని నమోదు చేసుకొని విలవిల్లాడింది.
టీడీపీ..దెబ్బకు దెబ్బ..!
ఇప్పుడు రాష్ట్రంలో, జిల్లాలో రాజకీయ పరిస్థితులు మారిన నేపథ్యంలో వచ్చే స్థానిక ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. కూటమి దెబ్బకు రాష్ట్రస్థాయిలో ప్రతిపక్ష హోదాకు కూడా నోచనివిదంగా కుదేలైన వైసీపీ..జిల్లాలో పూర్తిగా తుడుచుకుపోయింది. గత స్థానిక ఎన్నికల్లో ఎదురైన ఘోర అవమానాగ్నితో రగులుతున్న టీడీపీ ఈ ఎన్నికల్లో పూర్వవైభవం సాధించి వైసీపీని కోలుకోలేని దెబ్బకొట్టి బదులు తీర్చుకోవడానికి ఇప్పట్నుంచే తగిన అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. అవసరమైతే, గత ఎన్నికల్లో అడ్డదారి గెలుపుకోసం వైసీపీ పాటించిన 'పద్ధతి'ని అనుసరించాలని భావిస్తోంది.
వైసీపీ..మేకపోతు గాంభీర్యం
ఈసారి ఎన్నికల్లో గెలుపు అంత వీజీ కాదని తెలిసినా, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో డీలాపడి కాడె వదిలేసిన కేడర్ను ఉత్సాహపరిచ్చేందుకు ఈసారి కూడా విజయం మాదేనంటూ వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా లోలోపల రాజకీయ భవిష్యత్తుపై వారిలో భయం గూడుకట్టుకుంది. స్థానిక ఎన్నికల్లో గౌరవప్రదమైన సంఖ్యలో స్థానాలు గెలుచుకుని పరువు కాపాడుకోవాలని వారు యోచిస్తున్నప్పటికీ, దెబ్బతిన్న పులిలా ఎదురు చూస్తున్న టీడీపీ శ్రేణుల చేతిలో చావుదెబ్బ తప్పేలా లేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
జనసేన..టూ ఇన్ వన్ ప్లాన్..
బలోపేతానికి వచ్చే స్థానిక ఎన్నికల్లో గెలుపోటములు ఎలాఉన్నా సంస్థాగతంగా బలపడేందుకు దీన్నొక వేదికగా మలుచుకొనే కోణంలో జనసేన అడుగులు వేసే అవకాశం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. కూటమిధర్మం ప్రకారం తమపార్టీకి కేటాయించిన స్థానాల్లో టీడీపీ మద్దతు సహకారంతో విజయం సాధించి, మిగిలిన చోట్ల ఇదే అదనుగా పార్టీని బలోపేతంచేసి సంస్థాగత నిర్మాణంలేని లోటును భర్తీ చేసుకునేందుకు ఆపార్టీ ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయనేది పరిశీలకుల మాట. మొత్తమ్మీద, వచ్చే స్థానిక ఎన్నికలు గ్లాసుపార్టీ పునాదిని పటిష్టపరిచేందుకు దోహదపడుతుందన్న అభిప్రాయం ఆపార్టీ కేడర్లో వ్యక్తమవుతోంది. ఇక, లీడర్, కేడర్ లేని బీజేపీ ఎప్పట్లాగే ఆటలో అరటిపండుగా మిగలనున్నందున ఆపార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ఏదేమైనా,పట్టణాలు, పల్లెల్లోని రాజకీయ శిబిరాల్లో అప్పుడే మొదలైన స్థానిక ఎన్నికల హడావుడి, దసరా పండుగ సందడి ముందే స్థానిక సందడి స్పష్టంగా కనిపిస్తోంది.