సంగమేశ్వర ఆలయంలో ఘనంగా వరుణ జపం, వరుణ యాగం
మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక పూజలు
సంగం మేజర్ న్యూస్ : సంగంలోని శ్రీ కామాక్షీదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో వరుణ దేవుని అనుగ్రహం కోసం మంగళవారం ప్రత్యేకంగా వరుణ జపం, వరుణ యాగం ఘనంగా నిర్వహించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య వరుణ దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జలంలో కూర్చుని అర్చకులు వరుణ దేవుని మంత్రాలను జపిస్తూ పూజా కార్యక్రమాలను కొనసాగించారు. వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి పుష్కలంగా వర్షాలు కురవాలని, పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. వరుణ దేవుని కృపతో ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు మేలు జరగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో టీడీపీ నాయకులు పాల్గొని సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డి, మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులు రెడ్డి, గుండ్లపల్లి శ్రీనివాస్ యాదవ్, నీటి సంఘ అధ్యక్షులు ఎస్ కే బాబు,కాకు మధుసూదన్ యాదవ్, గునుపూడి గిరి తదితర మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.