andhrapradesh
శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఆలయాలు
నేటి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
విద్యుత్ దీప అలంకరణల్లో ముస్తాబైన ఆలయాలు
అవనిగడ్డ, మేజర్ న్యూస్ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు దివిసీమలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. ఆదివారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా ప్రాచీన శివాలయం గా పేరు అందిన శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజశేఖర
స్వామి దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పూజలు నిర్వహించనున్నారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. మరోవైపు శ్రీ లంకమ్మ అమ్మవారి ఆలయంలోనూ దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
శివాలయంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 11న బాలా త్రిపురసుందరి దేవిగా, 12న గాయత్రీ దేవిగా, 13న అన్నపూర్ణాదేవిగా, 14న లలితా త్రిపురసుందరి దేవిగా, 15న గంగా దేవిగా, 16న సరస్వతీ దేవిగా, 17న ధనలక్ష్మీ దేవిగా, 18న దుర్గాదేవిగా, 19న మహిషాసురమర్దిని దేవిగా అమ్మవారు అలంకరణల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 20న విజయదశమి సందర్భంగా రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు.
ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించేందుకు అర్చకులు ఘంటసాల పవన్ కుమార్ శర్మ ఏర్పాట్లు చేశారు. ప్రధాన అర్చకులు ఘంటసాల రాజశేఖర్ శర్మ (పసి) ఆధ్వర్యంలో అమ్మవారికి రోజువారి అలంకరణలు చేయనుండగా, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారి దర్శనం, పూజలతో అవనిగడ్డ ప్రాంతంలో ఆధ్యాత్మిక సందడి నెలకొననుంది. ఆలయ కమిటీ చైర్మన్ ఘంటసాల రాజమోహనరావు (కన్నయ్య) కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ శ్రీనివాసరావు (వాసు) ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు
శ్రీ లంకమ్మ అమ్మవారి దేవస్థానంలోనూ ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల నేపథ్యంలో భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆలయ చైర్మన్ అన్నపురెడ్డి వెంకటస్వామి కార్య నిర్వహణ అధికారి వాసు, దామెర్ల ఏడుకొండల భక్తులకు కావలసిన ఏర్పాట్లను చేస్తున్నారు. కామాక్షి అమ్మవారి ఆలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తున్నారు.దసరా ఉత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని పులిగడ్డ, వేకనూరు గ్రామాలలో అమ్మవారి ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించి శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధం చేస్తున్నారు.
- అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.