సరస్ కు సందర్శకుల తాకిడి
విజయనగరం, సూర్య : అఖిలభారత డ్వాక్రా బజార్ (సరస్ మేళా-2026) రెండో రోజైన శనివారం సందర్శకులు, కొనుగోలుదారులతో కిటకిటలాడింది. మాన్సాస్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు నగర ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. వారాంతం కావడంతో ఉదయం నుంచే నగరవాసులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్టాళ్లను సందర్శించారు. వివిధ రాష్ట్రాల నుంచి మహిళా సంఘాలు ప్రత్యేకంగా తీసుకువచ్చిన హస్తకళలు, సంప్రదాయ వస్త్రాలు, గృహోపకరణాలు, సేంద్రీయ తినుబండారాలు కొనుగోలుదారులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కేరళ, అస్సాం, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల ప్రత్యేక ఉత్పత్తుల విక్రయ కేంద్రాల వద్ద సందర్శకుల రద్దీ నెలకొంది. డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు లభిస్తున్న ఈ ఆదరణ పట్ల డీఆర్డీఏ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
రిపోర్టర్ : డేవిడ్ రాజు, విజయనగరం.