andhrapradesh
సాంకేతికతను సృజనాత్మకంగా వినియోగించి ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలి
నగరం, మేజర్ న్యూస్: స్థానిక శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాలలో కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన "ఏఐ ఫర్ వికసిత్ భారత్" జాతీయ సదస్సు రెండవ రోజైన శనివారం ముగిసింది. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం డాక్టర్ యు. సూర్యకుమారి, మ్యాథమెటిక్స్ విభాగం డాక్టర్ రావి శ్రీనివాసరావులు ముఖ్య వక్తలుగా పాల్గొని మాట్లాడుతూ, కృత్రిమ మేధ భవిష్యత్ అవకాశాలు, పరిశోధన, పరిశ్రమల్లో దాని వినియోగంపై వారు విశ్లేషణాత్మక వివరణ లిచ్చారు. సదస్సుకు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అనగాని హరికృష్ణ అధ్యక్షత వహించారు. కళాశాల సెక్రటరీ, కరెస్పాండెంట్ వల్లభనేని బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, కృత్రిమ మేధ నేడు విద్య, పరిశోధన, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారితీస్తోందన్నారు. విద్యార్థులు ఈ సాంకేతికతను సృజనాత్మకంగా వినియోగించుకొని, భవిష్యత్తులో ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సదస్సులో సమర్పించిన పరిశోధనా పత్రాలు, సాంకేతిక చర్చలు, నిపుణుల ఉపన్యాసాలు విద్యార్థులకు, అధ్యాపకులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచాయని ఆయన తెలిపారు. కృత్రిమ మేధ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, పరిశోధన, పరిశ్రమల్లో ఏఐ వినియోగం, వికసిత్ భారత్ నిర్మాణంలో ఆధునిక సాంకేతికత పాత్ర వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. సదస్సులో పాల్గొన్న పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆర్. ప్రసన్నబాబు, కార్యాలయ సూపరింటెండెంట్ అమరేష్ రెడ్డి, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి జి. అనురాధ, మ్యాథమెటిక్స్ విభాగాధిపతి యు. శివప్రసాద్, ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి ఏ. శ్రీదేవి, అధ్యాపకులు, పరిశోధకులు, ఇతర విభాగాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.