రేపు ఎన్జీ రంగా వర్సిటీలో రబీ విత్తన దినోత్సవం
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సోమవారం ఉదయం 10 గంటలకు రబీ విత్తన దినోత్సవం నిర్వహిస్తున్నట్లు సహపరిశోధన సంచాలకులు డా.వి.చంద్రిక తెలిపారు. ఈ ఏడాది రబీ కాలానికిగాను విత్తన దినోత్సవాన్ని విశ్వవిద్యాలయ ఆదేశాల మేరకు రైతుల ప్రయోజనార్థం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రబీ కాలానికి ఎల్-నినో సందర్భంగా ఎదురయ్యే బెట్ట పరిస్థితులకు అనుగుణంగా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, నీటి ఎద్దడిని తట్టుకోగలిగే పంటల ప్రణాళికను, అనువైన రకాలు, వాటి లభ్యత వివరాలను, క్రొత్త వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని గురించి రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. ప్రాంతీయ స్థానం నుండి విడుదలైన వేరుశనగ, నువ్వుల్లో వైఎల్ఎం 146, వైఎల్ఎం 66, కందుల్లో టిఆర్జి 59, మినుముల్లో టీబిజీ 129 రకాల నాణ్యమైన విత్తనాలు అమ్మకానికి అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరగబోయే ఈ విత్తన దినోత్సవ కార్యక్రమానికి తిరుపతి, చిత్తూరు జిల్లాల రైతులందరూ విచ్చేసి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి