రైతులకు అవగాహన కల్పించేందుకు కిసాన్ మేళా
మార్కాపురం రూరల్, మేజర్ న్యూస్:
రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రభుత్వ పథకాలు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు మార్కాపురం మార్కెట్ యార్డులో గురువారం కిసాన్ మేళా నిర్వహించనున్నారు. అక్టోబర్ 8వ తేదీ ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది.ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించనున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న వివిధ పథకాలు, ఆధునిక సాగు పద్ధతులు, పంటలలో డ్రోన్ టెక్నాలజీ వినియోగం, దాని ప్రయోజనాలు తదితర అంశాలను వివరించనున్నారు. అలాగే హార్టికల్చర్ హబ్ ప్రత్యేకతలు, ఉద్యాన పంటల సాగుతో రైతులకు కలిగే ప్రయోజనాలపై కూడా అవగాహన కల్పించనున్నారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో అందిపుచ్చుకోవడంతో పెట్టుబడి వ్యయం తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. రైతులకు ఉపయోగపడే విలువైన సమాచారాన్ని నిపుణుల ద్వారా నేరుగా తెలుసుకునే అవకాశం ఉన్నందున మార్కాపురం మండలంలోని రైతులందరూ కిసాన్ మేళాకు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కోరారు.