రైతుబజార్లలో రాయితీపై 'ధరణి' బియ్యం అమ్మకాలు జిల్లా కలెక్టర్ డా ఎన్. ప్రభాకర రెడ్డి
పార్వతీపురం, మేజర్ న్యూస్ : ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే లక్ష్యంతో పార్వతీపురం మన్యం జిల్లాలోని నిర్దేశిత రైతుబజార్లలో రాయితీపై 'ధరణి' బ్రాండ్ బియ్యం విక్రయాలను అక్టోబరు 12 నుంచి ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. ఈ మేరకు ధరణి బ్రాండ్‌కు చెందిన కె యన్ యం మరియు బీపీటీ రకాల బియ్యాన్ని ప్రాధాన్యతా క్రమంలో రైతుబజార్లకు తరలిస్తున్నామని, అక్కడ సకాలంలో స్టాక్ దిగుమతి, నిల్వ, విక్రయాలు జరిగేలా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బియ్యం అమ్మకాలు సాఫీగా జరిగేలా పౌరసరఫరాల శాఖ, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. వినియోగదారులు రైతుబజార్లను సందర్శించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరిన కలెక్టర్, స్టాక్ లభ్యత, అమ్మకాలను నిరంతరం పర్యవేక్షించాలని, సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిత్యావసర వస్తువులను ప్రజలకు సరసమైన ధరలకే అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.