రామవరంలో వైభవంగా గొల్లాలమ్మ అమ్మవారి గ్రామ ప్రవేశం
అనపర్తి, మేజర్ న్యూస్.అనపర్తి మండలం రామవరం గ్రామంలో గ్రామదేవత శ్రీ గొల్లాలమ్మ అమ్మవారి గ్రామ ప్రవేశ వేడుక బుధవారం రాత్రి అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రెండేళ్లకు ఒకసారి అమ్మవారు గ్రామానికి విచ్చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా గ్రామమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఘన స్వాగతం పలికారు.కార్తీక మాసంలో గ్రామ ప్రవేశం చేసిన గొల్లాలమ్మ అమ్మవారు ధనుర్మాసం ముగిసి సంక్రాంతి పండుగ వరకు గ్రామంలో కొలువుదీరి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కాలంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, సంప్రదాయబద్ధమైన ఆచార వ్యవహారాలు నిర్వహించనున్నారు. గొల్లాలమ్మ అమ్మవారికి మల్లిడి వంశస్థులు తమ ఆడపడుచుగా, కర్రి వంశస్థులు అత్తింటి వారుగా భావించి తరతరాలుగా ప్రత్యేక సంప్రదాయాలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామ ప్రవేశ వేడుకలో భాగంగా సల్లఘటం రూపంలో ఉన్న అమ్మవారిని మల్లిడి, కర్రి వంశస్థులు సంప్రదాయబద్ధంగా చీరలపై నడిపిస్తూ గ్రామంలోకి ఆహ్వానించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ వేడుకను తిలకించేందుకు గ్రామానికి చెందిన ప్రముఖులు, పెద్దలు, మహిళలు, యువకులు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మంగళ వాయిద్యాలు, భక్తుల సందడి మధ్య అమ్మవారికి స్వాగతం పలికారు. గ్రామదేవత రాకతో రామవరం గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. తరతరాలుగా వస్తున్న ఆచార సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడంలో గ్రామస్తులు చూపుతున్న ఆసక్తి ఈ వేడుకలో ప్రతిబింబించింది.